calender_icon.png 28 November, 2024 | 7:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

32 ఎకరాలకు ఎన్వోసీ

28-11-2024 03:22:37 AM

  1. ఉస్మానియా దవాఖాన నిర్మాణంలో కీలక మలుపు
  2. మరో ఎనిమిది అంశాలకూ గ్రీన్‌సిగ్నల్ 
  3. బల్దియా స్టాండింగ్  కమిటీ సమావేశంలో నిర్ణయం

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 27 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో కొత్తగా ఉస్మానియా దవాఖాన నిర్మాణానికి పోలీస్ శాఖకు చెందిన 31.39 ఎకరాలకు ఎన్వోసీ ఇచ్చేందుకు సిఫార్సు చేస్తూ జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు నాంపల్లి(వార్డు 45) లోని పోలీస్ క్వార్టర్స్, గోషామహాల్ బంక్, స్టేడి యం, బాస్కెట్ బాల్, బాడ్మింటర్ కోర్టులకు సంబంధించిన 31.39 ఎకరాల భూమిని ఉస్మానియా జనరల్ ఆసుపత్రి నిర్మాణానికిగాను ఎన్వోసీ జారీ చేయాలని స్టాండింగ్ కమిటీ తీర్మానించింది.

ఈ సందర్భంగా మేయర్ గద్వాల విజయలక్ష్మీ అధ్యక్షతన జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం లో బుధవారం ఎన్వోసీతో పాటు మరో ఎనిమిది అంశాలతో పాటు ఒక టేబుల్ ఐటమ్‌ను స్టాండింగ్ కమిటీ సభ్యులు ఆమోదించారు. సమావేశంలో జీహెఎంసీ కమిషనర్ ఇలంబరితి, జోనల్ కమిషనర్లు అనురా గ్ జయంతి, అపూర్వ చౌహాన్, హేమంత్ కేశవ్ పాటిల్, రవికిరణ్, ఉపేందర్ రెడ్డి, వెంకన్న, స్టాండింగ్ కమిటీ సభ్యులు బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్, మహమ్మద్ ముజాఫర్ హుస్సేన్, ఫాహెద్ బిన్ అబ్దు ల్ సమద్, మహమ్మద్ ఖదీ ర్, మహమ్మద్ నసీరుద్దీన్, మహమ్మద్ గౌస్ ఉద్దీన్, మన్నె కవితా రెడ్డి, మహమ్మద్ రషీద్ ఫరాజుద్దీన్ పాల్గొన్నారు.   

ఆమోదించిన అంశాలివే.. 

* నాగమయ్య కుంటలో ఎస్‌ఎన్‌డీపీ కింద రూ.19.34 కోట్లతో పూర్తయిన నాలా రీ మోడలింగ్ పనులు పూర్తి కాగా, ఎస్‌ఎన్‌డీపీ మిగులు నిధులు రూ.3 కోట్ల అంచనా వ్యయంతో నాలా పొడిగింపు. ప్రతిపాదించిన బాక్స్ డ్రెయిన్ పనులకు ఆమోదం.

* హబీబ్ నగర్ నుంచి చాంద్రాయణగుట్ట మెయిన్ రోడ్, పాపాలాల్ టెంపుల్ మీదుగా రియాసత్ నగర్ నుంచి హబీబ్ నగర్ వరకు రహదారి అభివృద్ధి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 174 ఆస్తులు సేకరణ. 

* మల్లేపల్లి సమీపంలోని స్లమ్ ఏరియా నిరుద్యోగ యువత, మహిళలకు లైట్ హౌస్ కమ్యూనిటీ ఫౌండేషన్‌కు సీఎస్సార్ కింద సెంటర్ ఫర్ స్కిల్లింగ్ అండ్ లవ్లీ హుడ్ ప్రోగ్రాం ద్వారా ఏడాది పాటు శిక్షణకు మల్లేపల్లి మోడల్ మార్కెట్ బిల్డింగ్ స్వాధీనానికి అనుమతులు. సంబంధిత ఏజెన్సీతో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ఎంఓయూకు ఆమోదం.

* ఎఫ్‌సీఐ గోడౌన్ రోడ్ నుంచి ఐఓసీఎల్ మీదుగా  గ్రోసెన్ హెల్త్ కేర్ నుంచి (చర్లపల్లి రైల్వే సరిహద్దు) వరకు ప్రతి పాదిత 24 మీటర్ల నుంచి 30 మీటర్ల వరకు పెంచేందుకు ఆరు ఆస్తుల సేకరణ. రివైజ్డ్ ప్రతిపాదనలు ఆమోదం.

* గ్రేటర్ వ్యాప్తంగా క్రీడల నిర్వహణకు ప్రతి డివిజన్‌కు రూ.2 లక్షల విలువైన మెటీరియల్ అందజేతకు ఆమోదం.

* 2024 ఆగస్టుకు సంబంధించిన జీహెచ్‌ఎంసీ ఆదాయ, వ్యయాలకు ఆమోదం.

* డిప్యూటీ మేయర్ క్యాంపు కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ సేవల పొడిగింపు. సికింద్రాబాద్ జోన్‌లో అదనపు పోస్ట్ మంజూరుకు అనుమతి. 

* సెప్టెంబర్ నెల జీహెచ్‌ఎంసీ ఆదాయ, వ్యయాలకు ఆమోదం.