calender_icon.png 15 October, 2024 | 5:01 AM

అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్

15-10-2024 02:19:22 AM

డారెన్, రాబిన్‌సన్, సైమన్‌ను వరించిన అవార్డు

దేశాల మధ్య సంపద అసమానతలపై పరిశోధనకు పురస్కారం

స్టాక్‌హోం, అక్టోబర్ 14: అర్థశాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతిని 2024 ఏడాదికి గాను ముగ్గురు శాస్త్రవేత్తలకు అందిస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సోమవారం ప్రకటించింది. డారెన్ ఏస్మోగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ రాబిన్‌సన్ ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.

వివిధ దేశాల మధ్య సంపదలో అసమానతలపై పరిశోధనలకు వీరు నోబైల్ ప్రైజ్‌కు ఎంపికయ్యారని అకాడమీ తెలిపింది. అమెరికాలోని కేంబ్రిడ్జిలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో డారెన్, సిమోన్ పనిచేస్తున్నారు. రాబిన్‌సన్ షికాగో యూనివర్సిటీకి చెందినవారు. 

అన్ని రంగాల్లో విజేతల ప్రకటన 

అర్థశాస్త్రంలో విజేతల వెల్లడితో నోబెల్ పురస్కారాల ప్రకటన సోమవారంతో ముగిసింది. ఇప్పటివరకు వైద్య భౌతిక, రసాయన శాస్త్రాలు, సాహిత్యం, శాంతి బహుమతులను ప్రకటించారు. డైనమైట్ సృష్టికర్త, స్వీడన్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష కృషి చేసినవారికి ఈ బహుమతిని ప్రదానం చేస్తారు.

1896లో నోబెల్ మరణించగా 1901లో ఏర్పాటైన ఆయన ట్రస్ట్ ద్వారా ఈ పురస్కారాలను ఏటా ప్రదానం చేస్తున్నారు. డిసెంబర్ 10న నిర్వహించే కార్యక్రమంలో గ్రహీతలకు అవార్డులను అందజేస్తారు. వీరికి 11 మిలియన్ డాలర్లు బహుమతిగా అందజేస్తారు.