calender_icon.png 11 October, 2024 | 4:58 AM

కొరియా రచయిత్రి హాన్ కాంగ్‌కు నోబెల్

11-10-2024 02:26:17 AM

ప్రకటించిన రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్

సాహిత్యంలో తొలి దక్షిణ కొరియా మహిళగా ఘనత

జీవితంలోని కష్టాలు, చారిత్రక విషాదాలపై రచనలు

స్టాక్‌హోం, అక్టోబర్ 10: దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్‌ను 2024 ఏడాదికిగాను సాహిత్యంలో నోబెల్ పురస్కారం వరించింది. జీవిత దుర్భలత్వాన్ని, చారిత్రక విషాదాలను కళ్లకు కట్టినట్లు తన గద్య కవిత్వంలో వివరించినందుకు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ హాన్‌కు నోబెల్‌ను ప్రకటించింది. దక్షిణ కొరియా నుంచి సాహిత్యంలో నోబెల్ దక్కించుకున్న తొలి మహిళ గా హాన్ కాంగ్ చరిత్ర సృష్టించారు. అవార్డు రూపంలో మెడల్‌తో పాటు ఆమెకు 11 లక్ష ల డాలర్ల ప్రైజ్‌మనీ అందనుంది. 

సాహిత్య కుటుంబం నుంచి..

దక్షిణ కొరియాలోని గ్వాంగ్జులో హాన్ కాంగ్ 1970లో జన్మించారు. ఆమె సాహిత్య నేపథ్య కుటుంబం నుంచి వచ్చారు. హాన్ తండ్రి ప్రసిద్ధ నవలా రచయిత. 1993లో వింటర్ ఇన్ సియోల్‌తో పాటు ఐదు కవిత్యాలతో ఆమె సాహిత్య రంగంలోకి అడుగుపెట్టారు. 1994లో నవలా రచయిత్రిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. అదే ఏడాది రెడ్ యాంకర్ నవలతో సియోల్ సాహిత్య పోటీ ల్లో గెలుపొందారు.

1995లో యోవోసు పేరుతో పొట్టి కథల పుస్తకాన్ని రాశారు. కొరియా ఆర్ట్స్ కౌన్సిల్ సహకారంతో 1998 లో నిర్వహించిన యూనివర్సిటీ ఆఫ్ ఐయో వా ఇంటర్నేషనల్ రైటింగ్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. అంతేకాకుండా హాన్ అనేక నవలలు, పొట్టి కథలను రాశారు. ఆమె తాజాగా 2024లో రాసిన ఐ డునాట్ బిడ్ ఫేర్‌వెల్‌కు గాను మెడిసిస్ ప్రైజ్ (ఫ్రాన్స్)- 2023, ఎమిలీ గ్విమెట్ ప్రైజ్-2024 గెలుచుకున్నారు. 

జీవన్మరణాలపై రచనా ప్రయోగం

హాన్ కాంగ్ తన రచనల్లో మనుషులు అనుభవించే బాధను క్లుప్తంగా తెలియజేయడంతో పాటు మానసిక, భౌతిక వేదనను ఆవిష్కరిస్తారని నోబెల్ కమిటీ వెల్లడించింది. తూర్పు ప్రపంచంలోని అంశాలపై ఆమెకు విస్తృతమైన అవగాహన ఉందని తెలిపింది. చారిత్రక గాయాలు, శరీరం, ఆత్మ, జీవన్మరణాలపై ప్రయోగాత్మక శైలిలో సమకాలీన గద్యరూపకంగా ఆమె రచనలు చేశారని వివరించింది.

కాగా, గతేడాది నార్వేకు చెందిన రచయిత జాన్ ఫోసె నోబెల్ సాహిత్య బహుమతి అందుకున్నారు. ఇప్పటివరకు వైద్యం, భౌతిక, రసాయన శాస్త్రాలు, సాహిత్య రంగంలో విజేతలను ప్రకటించిన అకాడమీ శుక్రవారం నోబెల్ శాంతి బహుమతి గ్రహీత పేరును వెల్లడించనుంది. డైనమైట్ సృష్టికర్త, స్వీడిష్ శాస్త్రవేత్త అల్ఫ్రెడ్ నోబెల్ ట్రస్ట్ పేరిట ఏటా వివిధ రంగాల్లో విశేష కృషి చేసినవారికి ఈ పురస్కారాలను అందజేస్తారు. వీటిని ఏటా డిసెంబర్ 10న గ్రహీతలకు అందజేస్తారు.