calender_icon.png 9 October, 2024 | 3:54 PM

కృత్రిమ మేధకు నోబెల్ కిరీటం

09-10-2024 01:10:15 AM

ఏ సృష్టికర్తలకు ఫిజిక్స్‌లో నోబెల్

జెఫ్రీ హింటన్, జాన్ హాప్‌ఫీల్డ్‌కు అత్యున్నత పురస్కారం

రాయల్ స్వీడిష్ ఆకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటన 

న్యూఢిల్లీ, అక్టోబర్ 8: ప్రస్తుతం వైజ్ఞానిక ఓ ఊపు ఊపేస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) సృష్టికర్తలకు అత్యున్నత గౌరవం దక్కింది. ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ఏఐ, మెషిన్ లెర్నింగ్ సాంకేతికతను సృష్టించిన జాన్ హాప్‌ఫీల్డ్, జెఫ్రీ హింటన్‌ను సంయక్తంగా వరించింది.

వీరిద్దరూ మెషీన్ లెర్నింగ్ వితిన్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్‌వర్క్ ఆవిష్కరణలో చేసిన కృషికి గాను ఈ అవార్డు ప్రకటిస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మంగళవారం ప్రకటించింది. హాప్‌ఫీల్డ్ ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో, హింటన్ టొరంటో యూనివర్సిటీలో మెషీన్ లెర్నింగ్‌పై పరిశోధనలు చేశారు.

ఏఐకి హింట న్‌ను గాడ్ ఫాదర్‌గా భావిస్తారు. ఆయనతో పాటు హాప్‌ఫీల్డ్‌కు నోబెల్ పురస్కారం అందనుంది. ఈ సందర్భంగా హింటన్ మాట్లాడుతూ.. సాంకేతిక రంగంలో ఏఐ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినా కొందరు పరిమితికి మించి వాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది నియంత్రణ దాటకూడదని సూచించారు. 

గతంలో ముగ్గురికి నోబెల్

వీరికి నోబెల్ బహుమతి కింద 11 లక్షల డాలర్లు అందిస్తారు. 1901 నుంచి ఇప్పటివరకు 117 సార్లు ఈ పురస్కారాన్ని ప్రకటించగా 224 మంది ఈ బహుమతిని స్వీకరించారు. గతేడాది భౌతిక శాస్త్ర విభాగంలో నోబెల్ ముగ్గురిని వరించింది. అమెరికాకు చెందిన పెర్రీ అగోస్తిని, జర్మనీకి చెందిన ఫెరెన్స్ క్రౌజ్, స్వీడన్‌కు చెందిన అన్నె హ్యూలియర్ ఈ బహుమతిని అందుకున్నారు.