calender_icon.png 28 September, 2024 | 6:59 AM

గాలికొదిలిన్రు!

28-09-2024 03:10:48 AM

  1. గురుకులాలకు అద్దె భవనాలతోనే సరి 
  2. పడకేస్తున్న పారిశుద్ధ్యం, సుస్తి చేస్తే పిల్లలు ఇంటికే

కనీస సౌకర్యాలకు సైతం నోచుకోని వైనం 

పాముల సంచారంతో భయంభయంగా విద్యార్థులు 

రంగారెడ్డి/ ఆదిలాబాద్/ ఆసిఫాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలనే ఉన్నత లక్ష్యంతో ప్రారంభించిన గురుకులాలు కనీస వసతులకు నోచుకోక.. లక్ష్యం నీరుగారుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక గురుకులకు సొంత భవనాల్లేక అద్దె బిల్డింగులతోనే నెట్టుకొస్తు న్నారు.

వాటిల్లో కనీస వసతులు లేక వందలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొద్దున లేవగానే కనీస అవసరాలు తీర్చుకునేందుకు గంటల తరబడి బారులు తీరాల్సి ఉంటుంది. కనీస పారిశుద్ధ్య ప్రమాణాలు పాటించకపోవడంతో విద్యార్థులు తరు చూ రోగాలబారిన పడుతున్నారు. విద్యార్థులకు ఏ మాత్రం సుస్తి చేసినా ఇంటికి వెళ్లాల్సి వస్తోంది.

హాస్టళ్లలో పిల్లలకు నాణ్యమైన భోజనం అందడం లేదు. నిర్వాహకులు చేతివాటం ప్రదర్శిస్తూ జేబులు నింపుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురుకులాలపై ప్రభుత్వాధికారులు పర్యవేక్షణ పెంచి నాణ్యమైన విద్యనందించేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

తలుపులుండవు.. కిటికీలు కనిపించవు

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని గురుకులాల్లో కనీస వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు గురుకులాలకు సొంత భవనాలు లేక లీజుకు తీసుకొని కొనసాగిస్తున్నారు. ఆయా చోట్ల విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బాత్రూమ్‌లు లేవు. కాలకృత్యాలు, స్నానాలు చేసేందుకు విద్యార్థులు తిప్పలుపడుతున్నారు.

మరుగుదొడ్లు, స్నా నాల గదులు లేక ఆరుబయటకు వెళ్లాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాదర్‌గూల్‌లో ఉన్న గురుకులాలో గదులకు తలపులు, కిటికీలు లేవు. రాత్రిపూట విద్యార్థులు చలికి, వానకు వణుకు తున్నారు. పరిసరాల్లో ఎక్కడపడితే అక్కడ చెత్తచెదారంతో నిండిపోయింది.

రాత్రిపూట పాములు, తేళ్లు వస్తున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. కందుకూరు మండలంలోని ఎస్సీ గురుకులంలో బాత్రూమ్‌లకు తలుపు లు సరిగా లేవు. ఇక్కడ సమస్యలపై విద్యార్థులు తమ తల్లిదండ్రులకు, పై అధికారులకు ఫిర్యాదు చేస్తే గురుకుల టీచర్లు బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు విని పిస్తున్నాయి.

దీంతో విద్యార్థులు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోలేక లోలోపల మద నపడుతున్నారు. గురుకులాల్లో టెం డర్లు చేజిక్కించుకున్న ఏజెన్సీ నిర్వాహకులు సైతం చేతివాటం ప్రదర్శిస్తున్నారు. మెనూ ప్రకా రం అందించే చికెన్, మటన్, గుడ్లు, కూరగాయాలు, ఆకుకూరలు, పప్పులు, మంచి నూనె లాంటివి నాణ్యమైనవి వాడక విద్యార్థులు తరుచూ అస్వస్థతకు గురవుతున్నారు.

రోజువారిగా ఉదయం కిచిడీ, పులిహోర, నెలలో నాలుగుసార్లు చికెన్, రెండుసార్లు మ టన్, ఈ ఆరు రోజులు మినహా ప్రతీరోజు గుడ్లు, ఆపిల్ లేదా, బనానా, సాయంత్రం స్నాక్స్, మరుమరాలు, అటుకులు ఇవ్వాలి. కానీ వీటిలో చాలా వరకు విద్యార్థులకు అందడం లేదు.

జ్వరమొస్తే ఇంటికి పోవాలే..

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రభు త్వ గురుకులలు, ఆశ్రమ పాఠశాలల్లో చదువులు ఆందోళనకరంగా మారాయి. జిల్లాలో 4 బీసీ గురుకులాలు, 5 సాంఘిక సంక్షేమ గురుకులాలు, 2 ఎస్టీ గురుకులాలు, 4 మైనార్టీ గురుకులాలుండగా, 46 గిరిజన ఆశ్రమ పాఠశాలలున్నాయి. వీటితో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ హస్టళ్లు 25 వరకు ఉన్నా యి.

వీటిల్లో దాదాపుగా 20 వేల మంది చ దువుతున్నారు. అనేక గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో కిటికీలు, తలుపులు లేకపోవడం గమనార్హం. మరికొన్నింటిలో విద్యుత్ వైర్లు వేళ్లడుతున్నాయి. గురుకులాలకు వెళ్లే రోడ్డు సైతం బాలేక ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలో 5 గురుకులాలు అద్దె భవనా ల్లో కొనసాగుతున్నాయి.

జిల్లా కేంద్రంలోని డిగ్రీ గురుకుల మహిళా కాలేజీలో చదువుతున్న ఆసిఫాబాద్ మండలం మోవాడ్‌కు చెందిన కుమ్రం లక్ష్మీఅనే విద్యార్థిని ఇటీవల జ్వరంతో మృతి చెందింది. విద్యార్థులు విష జ్వరాలతో బాధపడుతున్నా వైద్యాధికారులు మాత్రం నామమాత్రంగా శిబిరాలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు.

కలె క్టర్, అడిషనల్ కలెక్టర్‌తో పాటు ఉన్నతాధికారులు తరుచూ తనిఖీలు చేపడుతున్నా నిర్వహకులు మాత్రం ఆడిందే ఆట అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. జిల్లాకేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా ర్థులకు తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. మినరల్ వాటర్ కు బదులు ట్యాంక్ ద్వారా తాగునీరు అందిస్తున్నారు.

స్టూడెంట్స్ చేతు లు కడుకొనే చోటే నీరు తాగుతున్నారు. ఈ ట్యాంక్‌ను ఎన్నో ఏండ్లుగా శుభ్రం చేయలేదనే  ఆరోపణలున్నాయి. సిర్పూర్ మండ లంలోని సాంఘిక సంక్షేమ గురుకులంలో విద్యార్థులకు జర్వా లు సోకడంతో కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మూ డు రోజులు సెలవులు ప్రకటించాల్సి వచ్చిం ది.

విద్యార్థులకు మెరుగైన వైద్యం అందిచాల్సిన అధికారులు విద్యా ర్థులకు జ్వరమొస్తే సెలవులు ఇవ్వడంతో పేద విద్యార్థులు స్థానికంగా ఉన్న పీహెచ్‌సీలకు వెళ్లి వైద్యం చే యించుకునే దుస్థితి నెలకొంది. 

అమ్మో పాములు..

ఆదిలాబాద్ జిల్లాలోని అనేక గురుకులాలు, ప్రభుత్వ స్కూళ్లలో పాముల సంచారం అధికంగా ఉంది. విద్యార్థులను కాటేసిన ఘటనలు కూడా చోటుచేసుకోవడం బాధాకరం. ఈ నేపథ్యంలో విద్యార్థులు బిక్కుబిక్కుమంటున్నారు. విద్యార్థులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పాఠాలు వింటున్నారు. జిల్లా కేంద్రంతో పాటు పాటు మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలల్లో సైతం ఇదే దుస్థితి నెలకొంది. భవనాలకు ప్రహరీలు లేక ఈ పరిస్థితి ఏర్పడింది.