10-03-2025 01:02:09 AM
చేర్యాల, మార్చి 9 : చెరువులలో, కుంటలలో నీరు లేక ఎండిపోవడంతో, బోరు బావులలో భూగర్భ జలాలు రోజు రోజుకి అడుగంటి పోతున్నాయి. వాటి మీద ఆధారపడి పంట సాగు చేసిన రైతుకు చి’వరి’కి కన్నీరే మిగులుతుంది. తపస్పెల్లి రిజర్వాయర్ నీటి మీద ఆశలు పెట్టుకున్నా రైతుకు అడియాశలుగానే మిగులుతుంది. పొట్ట దశకున్న పంట కళ్ళ ముందరే ఎండిపోతుంటే రైతు గుండె తరుక్కపోతుంది. నీరందకా ఎండిపోతున్న వైరు పైరు ను పశువులకు మేతగా వేస్తున్న వైనం కొమురవెల్లి మండల కేంద్రాంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సార్ల నరసింహులు తనకున్న నాలుగెకరాల పొలంలో వరి పంట వేశాడు.
గతంలో లాగానే తపస్పల్లి రిజర్వాయర్ నీటిని విడుదల చేస్తారని నమ్మకంతో పంటను సాగు చేశాడు. ఇప్పటిదాకా బోర్ల నుంచి వచ్చే నీటితో పంటను కాపాడుకుంటా వచ్చాడు. ఏడు ఎనిమిది రోజుల నుండి బోర్ల నుండ నీరు రావడం తగ్గింది. దీంతో పంటకు సరిపోయేంత నీరు అందడం లేదు. పంట ఎండు ముఖం పట్టింది. నీరు వస్తాయన్న భరోసా కోల్పోయిన రైతు, చేసేదేమీ లేక వరి పంటను కోసి పశువులకు మేతగా వేస్తున్నాడు. ఇప్పటికైనా నాయకులు, అధికారులు స్పందించి రిజ ర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసే విధంగా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.