calender_icon.png 5 October, 2024 | 6:59 AM

సూపర్‌వైజర్‌పై బదిలీ వేటు

05-10-2024 02:08:02 AM

భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 4 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని శిరిడి సాయి నగర్ సెక్టార్ సూపర్‌వైజర్ శారదపై అధికారులు శాఖా పరమైన చర్యలు తీసుకున్నారు. ఇటీవల విజయక్రాంతిలో ‘పర్యవేక్షణ పేరుతో పర్సంటేజీలు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. అంగన్‌వాడీ టీచర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐసీడీఎస్‌పీడీ విజేత విచారణ చేపట్టారు.

విచారణలో సూపర్‌వైజర్ ఏజెంట్ల ద్వారా వసూళ్లకు పాల్పడినట్లు, టీచర్లను మానసికంగా వేధించినట్లు తేలింది. దీంతో పీడీ విజేత ఆమెను శిరిడి సాయి సెక్టార్ నుంచి అదే ప్రాజెక్టు పరిధిలోని రేగళ్ల సెక్టార్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఐసీడీఎస్ సీడీపీవో లక్ష్మిప్రసన్నకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ క్రమంలో సీడీపీవో శుక్రవారం శారదకు ఉత్తర్వులు జారీ చేయగా ఆమె నిరాకరించినట్టు తెలుస్తోంది. ప్రొబెషనరీ పీరియడ్ పూర్తికాకుండానే అక్రమాలకు పాల్పడిన శారదపై శాఖ పరమైన చర్యలే కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అంగన్‌వాడీ టీచర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై సీడీపీవో లక్ష్మీప్రసన్నను వివరణ కోరగా కొంత సమయం కావాలని శారద ఉత్తర్వులు తీసుకోవడానికి నిరాకరించారని తెలిపారు.