calender_icon.png 11 October, 2024 | 4:47 PM

పాలమాకుల కస్తూర్బా సిబ్బందిపై బదిలీ వేటు

04-09-2024 12:10:00 AM

రాజేంద్రనగర్, సెప్టెంబర్3: శంషాబాద్ మండల పరిధిలోని పాలమాకుల కస్తూర్బా గాంధీ పాఠశాలకు చెందిన పదిమంది సిబ్బందిపై విద్యాశాఖ ఉన్నతాధికారులు బదిలీ వేటు వేశారు. ప్రత్యేక అధికారి మాధవితోపాటు మరో తొమ్మిది మంది బోధన, బోధనేతర సిబ్బందిని తక్షణమే బదిలీ చేస్తూ అధకారులు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇటీవల.. అన్నం, సాంబారులో పురుగు లు వస్తున్నాయని, తమను బడిలో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని, బూతులు తిడుతున్నారని.. ఆరోపిస్తూ విద్యార్థినులు పాఠశా ల సమీపంలోని బెంగళూరు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేసిన విషయం తెలిసిందే. అనంతరం మాజీ మంత్రులు హరీష్‌రావు, సబితారెడ్డి తదితరులు విద్యార్థులను పరామర్శించారు.

ఆ తర్వాత మంత్రి శ్రీధర్‌బాబు పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడిసమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీచర్ల మధ్య సమన్వయం లేకపో వడంతోనే సమస్య తలెత్తిందని.. మీ అందరినీ ఇక్కడి నుంచి బదిలీ చేస్తామని శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇక్కడి నుంచి పదిమంది సిబ్బందిని సాగనంపారు. అలాగే విద్యాశాఖ ఉన్నతాధికారులు పాఠశాలలోని సమస్యలను నోట్ చేసుకొని వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.