calender_icon.png 29 November, 2024 | 3:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సహించేది లేదు

29-11-2024 01:12:25 AM

  1. నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగాలు ఊడుతయ్ 
  2. విద్యార్థులను కన్న బిడ్డల్లా చూడాలి
  3. పాఠశాలలు, గురుకులాలను తరచూ తనిఖీ చేయాలి 
  4. పరిశుభ్ర వాతావరణంలో పౌష్టికాహారం అందజేయాలి
  5. కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం 
  6. ఫుడ్ సేఫ్టీ కోసం టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు
  7. ప్రభుత్వాన్ని బదనాం చేసేవారిపై చర్యలు తప్పవని హెచ్చరిక

హైదరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యా ర్థులకు ఆహారం అందించే విషయంలో అధికారులు, సిబ్బంది ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, వారి ఉద్యోగాలు ఊడతాయ్ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు.

రాష్ర్టవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు, గురుకుల పాఠశాల్లలో విద్యార్థులను కన్న బిడ్డల్లా చూడాలని, వారికి పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందించడంలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించొద్దని కలెక్టర్లను ఆదేశించారు. విద్యార్థులకు అందించే ఆహారానికి సంబంధించి చోటుచేసుకుంటున్న ఘటనలపై ముఖ్యమంత్రి పలుమార్లు సమీక్షించారు.

కలెక్టర్లు తరచూ పాఠశాలలు, వసతిగృహాలు, గురుకుల పాఠశాలలను తనిఖీ చేయాలని.. అనంతరం అందుకు సంబంధిం చిన నివేదికలను సమర్పించాలని సూచించారు. పలుమార్లు ఆదేశాలు ఇచ్చినా పొరపాట్లు జరుగుతుండడంతో సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థుల ఆహారం విషయంలో ఉదాసీనంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని స్పష్టంచేశారు.

అధికారులు నిర్లక్ష్యం చేసినట్టు రుజువైతే ఉద్యోగాల నుంచి తొలగించేందుకూ వెనుకాడబోమని ఘాటుగా చెప్పారు. విద్యార్థులకు మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో వేల సంఖ్యలో ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టడంతోపాటు వారికి పౌష్టికా హారం అందించేందుకు డైట్‌ఛార్జీలు పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేశారు.

విద్యార్థుల విషయంలో తాము సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ కొందరు ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అటువంటి వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. బాధ్యులైన వారిని చట్టప్రకారం శిక్షిస్తామని  తేల్చి చెప్పారు.

వసతి గృహాల్లో ఆహారం విషయంలో కొందరు ఉద్దేశపూర్వకంగా పుకార్లు సృష్టించడంతో పాటు లేని వార్తలను ప్రచారం చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళనలు సృష్టిస్తు న్నారని, వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 

ఆహార తనిఖీలకు టాస్క్‌ఫోర్స్ కమిటీ : సీఎస్ ఉత్తర్వులు

 ఫుడ్ పాయిజన్ ఘటనలు వెలుగు చూస్తు న్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ, సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆస్పత్రుల్లో ఫుడ్ సేఫ్టీని పర్యవేక్షించేందుకు ముగ్గురు సభ్యులతో టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది.

గురువారం సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు. ఎస్సీ అభివృద్ధి, గిరిజన, బీసీ, మైనార్టీ, మహిళా,శిశు సంక్షేమ, పాఠశాల విద్య, వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల పరిధిలో కొనసాగుతున్న పాఠశాలలు, గురుకులాలు, హాస్టళ్లు, ఆస్పత్రుల్లో ఆహార నా ణ్యత పెంచడమే ల క్ష్యంగా ఈ కమిటీని పనిచేస్తుందని పేర్కొన్నారు.

ఈ టాస్క్‌ఫోర్స్ కమిటీలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్, విద్యాసంస్థ అధికారి, జిల్లాస్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ ఫుడ్ పాయిజన్ ఘటనలు వెలుగు చూ సినా వెంటనే టాస్క్ ఫోర్స్ కమిటీ సందర్శించి, కారణాలపై దర్యాప్తు చేస్తుందని, కారకులను గుర్తించడంతోపాటు పూర్తి సమాచారంతో కూడి న నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

విద్యాసంస్థకొక ఫుడ్ సేఫ్టీ కమిటీ 

 ఫుడ్ పాయిజన్ ఘటనలను అరికట్టడంలో భాగంగా టాస్క్‌ఫోర్స్ కమిటీతోపాటు విద్యాసంస్థ స్థాయిలోనూ మరొక ఫుడ్ సేఫ్టీ కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దీనికి సం బంధించిన ఉత్తర్వులను సీఎస్  జారీచేశారు. విద్యార్థులకు  పరిశుభ్రమైన ఆహారం అందించడంలో ఈ కమిటీ కీలకంగా వ్యవహరించనున్న ది.

కమిటీలో పాఠశాల హెచ్‌ఎంతోపాటు మరో ఇద్దరు సిబ్బంది సభ్యులుగా ఉంటారు. ప్రతిరోజు భోజనం తయారు చేసే ముందు కిచెన్, వంట సామగ్రిలో నాణ్యతను విధిగా కమిటీ పరిశీలిస్తుంది. భోజనం తయారైన తర్వాత పిల్లలకు పెట్టే ముందు రుచి, నాణ్యతను పరీక్షిస్తుంది.

ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రతిరోజు రికార్డు చేస్తుంది. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో మండల, డివిజన్, జిల్లా స్థాయిలో సూపర్‌వైజర్లు అన్ని విద్యాసంస్థలను పరిశీలిస్తుంటారు.