calender_icon.png 20 January, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నో బ్యాగ్ డేకు నో

20-01-2025 12:50:39 AM

  1. ప్రభుత్వ, జిల్లా పరిషత్ బడులకే పరిమితం
  2. మోడల్, కేజీబీవీ, ప్రైవేట్ స్కూళ్లలో అమలు కాని వైనం

హైదరాబాద్, జనవరి 19 (విజయక్రాంతి): రాష్ట్రంలోని అన్ని బడుల్లో ‘నో బ్యాగ్ డే’ పూర్తిస్థాయిలో అమలు కావడంలేదు. విద్యాసంవత్సరం ప్రారంభంలో పిల్లల స్కూల్ బ్యాగ్‌పై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ప్రధానంగా ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల బరువు కంటే వారి పుస్తకాల బరువే ఎక్కువ ఉంటోందన్న విమర్శలున్నాయి.

ఈ కారణంగా చిన్నారులకు వెన్నెముక, మెడనొప్పి సమస్యలు వస్తున్నాయి. ఈ నేపథ్యం లోనే చిన్నారుల కోసం ప్రతినెలా మూడో శనివారం ‘నో బ్యాగ్ డే’గా పాఠశాల విద్యాశాఖ ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ప్రకటించింది. నో బ్యాగ్ డే రోజు విద్యార్థులు పుస్తకాలు లేకుండా స్కూళ్లకు రావాల్సి ఉంది.

ఆ రోజు ఆటపాటలు, డిబెట్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యార్థుల మేధస్సును పదునుపెట్టేలా ఆయా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు దీన్ని తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. అయితే ప్రైవేట్ పాఠశాలల్లోనే కాకుండా ప్రభుత్వ పాఠశాలలైన మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లోనూ నిబంధనలు పాటించడం లేదని తెలుస్తోంది.

గత రెండేళ్లుగా ప్రతి నెల మూడో శనివారాన్ని పేరెంట్స్ మీటింగ్, నో బ్యాగ్ డేగా నిర్వహిస్తూ వస్తున్నారు. సాధారణంగా పాఠశాల విద్యాశాఖ జారీ చేసే ఉత్తర్వులన్నీ అన్నిరకాల స్కూళ్లకు వర్తిస్తాయి. అంటే ప్రభుత్వ స్కూళ్లు, ప్రైవేట్ స్కూళ్లు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు ఇలా అన్నీ స్కూళ్లకు ఆయా ఉత్తర్వులు వర్తిస్తాయి.

కానీ, ప్రభుత్వ పాఠశాలలైన మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లోనే నో బ్యాగ్ డే అమలుపరచడం లేదని పలువురు ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇక ప్రైవేట్ పాఠశాలల్లోనైతే నో బ్యాగ్ డే అనే ఒక రోజు ఉన్న విషయం కూడా విద్యార్థులకు తెలియని పరిస్థితి ఉంది. ఈ విషయమై విద్యాశాఖ దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు.