calender_icon.png 15 November, 2024 | 10:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘పాలమూరు’కు నిధులిచ్చే తీరిక లేదా?

12-11-2024 01:09:38 AM

మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి 

హైదరాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి) : కేసీఆర్ పాలమూరు జిల్లాను నిర్లక్ష్యం చేశారనడం సీఎం రేవంత్ అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. కాంగ్రెసోళ్లు వందల కేసులు వేసినా కుట్రలను ఛేదించి పాలమూరు ఎత్తిపోతల పథకం పనులు 90 శాతం పూర్తి చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.

రూ.200 కోట్లు ఇస్తే పీఆర్‌ఎల్‌ఐలో ఎలక్ట్రికల్ పనులు ముందుకు సాగుతాయని, దానికి నిధులు కేటాయించే తీరిక సీఎంకు లేదా అని నిలదీశారు. 40 రోజులు పనిచేస్తే పాలమూరు ఎత్తిపోతల కింద నిర్మించిన రిజర్వాయర్లలో నీళ్లు నింపుకునే అవకాశం ఉందని.. 11 నెలలుగా ప్రభుత్వం పనులను గాలికొదిలేసిందని విమర్శించారు.

11 నెలల పాలనలో సీఎంకు 26 సార్లు ఢిల్లీకి వెళ్లేందుకు, పక్క రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్లే తీరిక దొరికింది కానీ.. పాలమూరు ప్రాజెక్టులపై చర్చించే సమయం లేకపోయిందని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో కేసీఆర్ కేఎల్‌ఐ పెండింగ్ పనులు పూర్తి చేసి 3.50 లక్షల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చారని గుర్తు చేశారు.

కురుమూర్తి స్వామి, జోగుళాంబ, మన్యంకొండ వేంకటేశ్వరస్వామి మీద ప్రమాణాలు చేసి రుణమాఫీ చేస్తానని మాట తప్పారని, ఆయన్ను చూసి దేవుళ్లే ఆలయాలను వదిలి పారిపోయే పరిస్థితి వచ్చిందన్నారు.