calender_icon.png 16 January, 2025 | 9:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.15 లక్షల వరకూ నో టాక్స్!

09-01-2025 12:00:00 AM

బడ్జెట్లో పన్ను చెల్లింపుదార్లకు ఊరట?

న్యూఢిల్లీ, జనవరి 8: మధ్యతరగతి పన్ను చెల్లింపుదార్లకు భారీ ఊరటనిచ్చేదిశగా అదాయపు పన్ను రేటును తగ్గించే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నదని సమాచారం. ఈ ప్రతిపాదన ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించే బడ్జెట్లో చోటుచేసుకుంటే రూ. 15లక్షల ఆదాయం వరకూ పన్ను చెల్లించనక్కర్లేదని ప్రభుత్వ వర్గాలు సూచనాప్రాయం గా వెల్లడించాయి.

దేశంలో మందగించిన వినియోగాన్ని పునరుద్ధరించేదిశగా వినియోగదారుల చేతుల్లో మరింత మిగులు నిధుల్ని ఉంచేందుకు పన్ను తగ్గింపు ప్రతిపాదనను 2025 బడ్జెట్లో ప్రకటించే అవకాశం ఉన్నదని ఆ వర్గాలు వివరించాయి.

కొత్త పన్ను విధానంలోనే మార్పులు

 ప్రస్తుతం వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు రెండు రకాల పద్ధతులు అమలవుతు న్నాయి. ఎప్పటి నుంచో అమల్లో ఉన్న పాత పన్ను విధానానికి తోడు 2020 సంవత్సరంలో కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్టారు. పాత పన్ను విధానంలో ఆదాయపు పన్ను రిటర్న్‌లు సమర్పించేవారికి పలు మినహాయింపులు, రిబేట్లు లభిస్తాయి.

కొత్త ట్యాక్స్ రీజీమ్‌లో చాలావరకూ మినహాయింపులు ఉండవు. కానీ పన్ను రేట్లు తక్కువ. ఈ కొత్త పన్ను విధానం ప్రకారం రూ.3 లక్షల నుంచి రూ.10.5 లక్షల వరకూ 5 శాతం నుంచి 15 శాతం వరకూ పన్ను రేట్లు ఉన్నాయి. అంతకు మించిన ఆదాయంపై ఆయా శ్లాబ్‌ల్ని బట్టి 20 శాతం, 30 శాతం పన్ను రేట్లు అమలవుతున్నాయి.

అయితే ఈ విధానంలో స్టాండర్డ్ డిడెక్షన్ రూ. 75,000తో కలుకుకుని రూ.7.75 లక్షల ఆదాయంలోపు కలిగినవారికి పూర్తి పన్ను రిబేటు లభిస్తుంది. ఈ రిబేటుతో వారు పన్ను చెల్లించనక్కర్లేదు. కొత్త పన్ను విధానాన్ని అనుసరించేందుకు ప్రోత్సాహకంగా వచ్చే బడ్జెట్లో న్యూ ట్యాక్స్ రీజిమ్‌లో  ప్రవేశపెట్టే ప్రతిపాదనతో రూ.15 లక్షల వరకూ ఆదాయం పొందేవారికి పూర్తి పన్ను ఊరట లభిస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

రేట్ల తగ్గింపు పరిమాణంపై ప్రభుత్వం నిర్ణయం ఇంకా కరారు కాలేదని, బడ్జెట్ తేదీకి దగ్గర్లో నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. 

ప్రధాని మోది చెంతకు పన్ను తగ్గింపు ప్రతిపాదన

అదాయపు పన్ను భారాన్ని తగ్గించాలన్న ప్రతిపాదనను పలువురు ఆర్థిక వేత్తలు ప్రధాన మంత్రి నరేంద్ర మోది చెంత ఉంచారు. ఆదాయపు పన్ను రేట్లు తగ్గించాలని, కస్టమ్స్ సుంకాల్ని హేతుబద్దీకరించా లని, వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుర్చడానికి చర్యలు తీసుకోవాలని వారు సూచనలు చేశారు. బడ్జెట్ ముందస్తు సంప్రదింపుల్లో భాగంగా ప్రధానితో సమావేశమైన ఆర్థికవేత్తలు వివిధ అం శాలపై వారి అభిప్రాయాలను వివరించారు.

బేసిక్ పరిమితి రూ.4 లక్షలకు పెంచే ప్రతిపాదన

కొత్త పన్ను విధానంలో ప్రస్తుతం ఉన్న బేసిక్ మినహాయింపు పరిమితిని రూ. 4 లక్షల వరకూ పెంచే ప్రతిపాదనను బడ్జెట్లో ప్రవేశపెడతారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అందుకు తగిన రీతిలో ఇతర శ్లాబ్స్‌ను సవరిస్తారని సమాచారం. ఉదాహరణకు 5 శాతం పన్ను శ్లాబ్‌ను రూ.4 లక్షల నుంచి రూ. 7 లక్షలకు పెంచడం ద్వారా రూ. 14 లక్షల ఆదాయం వరకూ జీతభత్యాలు ఆర్జించేవారికి ప్రయోజనం చేకూరుతుంది.

ఇతర శ్లాబ్స్‌ను ఇదేరీతిలో ఇతర ప్రతీ శ్లాబ్‌నూ రూ. 1 లక్ష చొప్పున పెంచుతూపోతే పన్ను భారం తగ్గి, వినియోగానికి మరింత సొమ్మును పన్ను చెల్లింపుదార్ల చేతిలో ఉంచాలన్నది ప్రభుత్వ ఆలోచన అని ఆ వర్గాలు వివరించాయి.