calender_icon.png 27 December, 2024 | 3:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

10.5 లక్షల వరకూ నో ట్యాక్స్!

27-12-2024 01:03:13 AM

బడ్జెట్లో మధ్యతరగతికి ఊరట కల్పించే ప్రతిపాదన ?

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: మధ్యతరగతి పన్ను చెల్లింపుదార్లకు భారీ ఊరటనిచ్చేదిశగా అదాయపు పన్ను రేటును తగ్గించే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నదని సమాచారం.

ఈ ప్రతిపాదన వచ్చే బడ్జెట్లో చోటుచేసుకుంటే రూ.10.5 లక్షల ఆదాయం వరకూ పన్ను చెల్లించనక్కర్లేదని ప్రభుత్వ వర్గాల్ని ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ తాజా కథనంలో వెల్లడించింది. దేశంలో మందగించిన వినియోగాన్ని పునరుద్ధరించేదిశగా వినియోగదారుల చేతుల్లో మరింత మిగులు నిధుల్ని ఉంచేందుకు పన్ను తగ్గింపు ప్రతిపాదనను 2025 బడ్జెట్లో ప్రకటించే అవకాశం ఉన్నదని ఆ వర్గాలు వివరించాయి.

కొత్త పన్ను విధానంలోనే మార్పులు

 ప్రస్తుతం వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు రెండు రకాల పద్ధతులు అమల వుతున్నాయి. ఎప్పటి నుంచో అమల్లో ఉన్న పాత పన్ను విధానానికి తోడు 2020 సంవత్సరంలో కొత్త పన్ను విధానాన్ని ప్రవేశ పెట్టారు. పాత పన్ను విధానంలో ఆదాయపు పన్ను రిటర్న్‌లు సమర్పించేవారికి పలు మినహాయింపులు, రిబేట్లు లభిస్తాయి. కొత్త ట్యాక్స్ రీజీమ్‌లో చాలావరకూ మినహాయింపులు ఉండవు.

కానీ పన్ను రేట్లు తక్కువ. ఈ కొత్త పన్ను విధానం ప్రకారం రూ.3 లక్షల నుంచి రూ.10.5 లక్షల వరకూ 5 శాతం నుంచి 15 శాతం వరకూ పన్ను రేట్లు ఉన్నాయి. అంతకు మించిన ఆదాయంపై ఆయా శ్లాబ్‌ల్ని బట్టి 20 శాతం, 30 శాతం పన్ను రేట్లు అమలవుతున్నాయి. అయితే ఈ విధానంలో రూ.7.50 లక్షల ఆదాయంలోపు కలిగినవారికి పూర్తి పన్ను రిబేటు లభిస్తుంది.

ఈ రిబేటుతో వారు పన్ను చెల్లించనక్కర్లేదు. కొత్త పన్ను విధానాన్ని అనుసరించేందుకు ప్రోత్సాహకంగా వచ్చే బడ్జెట్లో న్యూ ట్యాక్స్ రీజిమ్‌లో  ప్రవేశపెట్టే ప్రతిపాదనతో రూ.10.5 లక్షల వరకూ ఆదాయం పొందేవారికి పూర్తి పన్ను ఊరట లభిస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నట్లు రాయిటర్స్ కథనంలో తెలిపింది.

రేట్ల తగ్గింపు పరిమాణంపై ప్రభుత్వం నిర్ణయం ఇంకా కరారు కాలేదని, బడ్జెట్ తేదీకి దగ్గర్లో నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. 

మోదీ చెంతకు పన్ను తగ్గింపు ప్రతిపాదన

ఆదాయపు పన్ను భారాన్ని తగ్గించాలన్న ప్రతిపాదనను పలువురు ఆర్థిక వేత్తలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెంత ఉంచారు. ఆదాయపు పన్ను రేట్లు తగ్గించాలని, కస్టమ్స్ సుంకాల్ని హేతుబద్దీకరించాలని, వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుర్చడానికి చర్యలు తీసుకోవాలని వారు సూచనలు చేశారు.

బడ్జెట్ ముందస్తు సంప్రదింపుల్లో భాగంగా ప్రధానితో సమావేశమైన ఆర్థికవేత్తలు వివిధ అంశాలపై వారి అభిప్రాయాలను వివరించారని, ప్రధాని సావధానంగా విన్నారని ఆ సమావేశానికి హాజరైన ఆర్థిక వేత్త ఒకరు చెప్పారు. వివిధ అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలపై ఆర్థికవేత్తలు వారి అభిప్రాయాలను, అనుసరించాల్సిన వ్యూహాలను ప్రధానికి సూచించినట్లు చెప్పారు.

6.5% వృద్ధి సాధిస్తాం

కేంద్ర ఆర్థిక శాఖ

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: అంతర్జాతీయ సవాళ్లు ఉన్నప్పటికీ, ప్రస్తుత (2024-25) ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం జీడీపీ వృద్ధిని సాధిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. 6.5-6.7 శాతంగా బడ్జెట్లో ప్రకటించిన అంచనాలో దిగువస్థాయిని అందుకుంటామని గురువారం ఆర్థిక శాఖ నవంబర్ నెల నివేదికలో పేర్కొంది.

ఈ అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికం మెరుగ్గా కన్పిస్తున్నదని, తొలి రెండు నెలల్లో (అక్టోబర్, నవంబర్) గ్రామీణ డిమాండ్ స్థిరంగా ఉన్నదని, పట్టణ డిమాండ్ కోలుకున్నదని తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 5.4 శాతానికి తగ్గింది.

అయితే ఆర్థిక సంవత్సరం అక్టోబర్-మార్చి మధ్యకాలంలో తొలి ఆరు నెలలకంటే ఆర్థిక వ్యవస్థ మెరుగైన పనితీరును కనపరుస్తుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. వచ్చే 2025-26 ఆర్థిక సంవత్స రం, తదుపరి ఏండ్లలో దేశీయ ఆర్థిక ఫండమెంటల్స్ పటిష్టంగా ఉంటాయన్నది.