calender_icon.png 1 November, 2024 | 6:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బజరంగ్‌పై సస్పెన్షన్ వేటు

24-06-2024 02:16:14 AM

న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్, ఒలింపిక్ పతక విజేత బజరంగ్ పునియాపై మరోసారి సస్పెన్షన్ వేటు పడింది. డోపింగ్ పరీక్షకు శాంపిల్ ఇవ్వని కారణంగా బజరంగ్‌ను నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) ఆదివారం సస్పెండ్ చేసింది. నెల రోజుల క్రితమే పునియాపై తొలిసారి వేటువేయగా.. ముందస్తు నోటీసులు జారీ చేయని కారణంగా దాన్ని క్రమశిక్షణ సంఘం ఎత్తివేసింది. అనంతరం తాఖీదులు ఇచ్చిన నాడా తాజాగా చర్యలకు ఉపక్రమించింది. దీంతో పారిస్ ఒలింపిక్స్‌లో బజరంగ్ పాల్గొనడంపై నీలినీడలు కమ్ముకున్నాయి.

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో మెరిసిన బజరంగ్‌పై ఈ సారి కూడా భారీ అంచనాలు ఉండగా.. తాజా నిర్ణయంతో అతడు విశ్వక్రీడల్లో పాల్గొనడంపై పలు సందేహాలు రేకెత్తుతున్నాయి. ఈ ఏడాది మార్చి 10న నాడా.. బజరంగ్ నుంచి మూత్ర నమూనాలను కోరింది. అయితే.. అందుకు అతడు నిరాకరించాడు. దీంతో నిబంధనలను ఉల్లంఘించినట్లు వెల్లడిస్తూ.. సస్పెండ్ చేసింది. వచ్చే నెల 11 లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

కాగా.. నాడా కాలంచెల్లిన డోపింగ్ పరీక్ష కిట్లను ఉపయోగిస్తోందని అందుకే తాను శాంపిల్స్ ఇవ్వలేదని బజరంగ్ గతంలో వెల్లడించాడు. దీనిపై మొదట సమాధానం ఇవ్వాలని బజరంగ్ కోరాడు. వివరణ ఇవ్వనందునే తాను నమూనాలు ఇవ్వలేదని స్పష్టం చేశాడు.