calender_icon.png 16 January, 2025 | 9:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్వే లేదు.. సాయం లేదు

11-09-2024 02:16:56 AM

ఖమ్మం వరద బాధితులకు అందని పరిహారం 

15,055 ఇళ్లు, 146 గుడిసెలు ధ్వంసం

ఒక్కో ఇంటికి రూ.16,500, గుడిసెకు రూ.8,000 పరిహారం 

70 శాతమే పూర్తయిన సర్వే 

ఖమ్మం, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా ఇంత వరకు వరద బాధితులకు పరిహారం అందలేదు. దీంతో బాధితులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రకటించిన ఆర్థిక సాయమే కొసరంత అది కూడా సకాలంలో విడుదల చేయకపోవడం పట్ల బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న ప్రతి బాధిత కుటుంబానికి మొదట ప్రకటించిన రూ.10వేలకు తోడు మరో రూ.6,500 కలిపి మొత్తం రూ.16,500 అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

మూడు నాలుగు రోజుల పాటు సర్వే కూడా చేసింది. ఎవరెవరు ఎంతమేరకు నష్టపోయారో ఇల్లిల్లు తిరిగి వివరాలు సేకరించారు. ఈ సర్వే కూడా 70 శాతం మించలేదనే విమర్శలున్నాయి. ఈ సర్వేలో జిల్లా వ్యాప్తంగా 15,055 ఇళ్లు దెబ్బతిన్నట్లు తేలింది. 146 గుడెసెలు దెబ్బతినగా, ఒక్కో గుడిసెకు రూ.8,000 వేలు చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం నుంచి బాధితుల బ్యాంక్ ఖాతాల్లో పరిహారం డబ్బులు జమచేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు జమ చేయలేదు.

దెబ్బతిన్న ఇళ్లకు మొత్తం రూ.9,78,57,500, గుడిసెలకు రూ.11,68, 000 ల ఆర్థిక సాయం అందాల్సి ఉంది. ఖమ్మం అర్బన్‌లో 9,155 ఇళ్లు దెబ్బతిన్నాయి. పరిహారం కింద రూ.5,95,0 7,500 అందించాల్సి ఉంది. ఖమ్మం రూరల్ మండలంలో 2,808 ఇళ్లు దెబ్బతినగా, రూ.1,82,52,000 సాయం అందాలి. మధిరలో 1,149 , ఎర్రుపాలెంలో 424, చింతకానిలో 119 , బోనకల్‌లో 112, ముదిగొండలో 222 ఇళ్లు దెబ్బతిన్నాయి. కూసు మంచి మండలంలో 417, నేలకొండపల్లిలో 195, తిరుమలాయపాలెంలో 178, వైరా నియోజకవర్గం వైరాలో 135, సింగరేణిలో 5, కారేపల్లి, రఘునాధపాలెంలలో ఒక్కో ఇల్లు దెబ్బతిన్నాయి.

ఏన్కూరులో 2 ఇళ్లు, తల్లాడలో 71,పెనుబల్లిలో 12, సత్తుపల్లిలో 5, వేంసూరులో 44 ఇళ్లు దెబ్బతిన్నట్లు అధికారులు సర్వే ద్వారా నిర్ధారించారు. ఇంకా సర్వే చేయని ఇళ్లను కూడా సర్వే చేసి, వారిని కూడా బాధితుల లిస్టులో చేర్చి, సాయం అందించాలని కోరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇంకా మరో రూ.2కోట్ల మేర బాధితులు నష్టపోయి ఉంటారని సమాచారం. చాలా చోట్ల బాధితులు తమ దగ్గరకు సర్వే పేరుతో ఎవరూ రాలేదని చెబుతున్నారు. 

కుచించుకుపోయిన ‘గోళ్లపాడు’

ఖమ్మంలోని గోళ్లపాడు చానల్ కాల్వ ఆక్రమణకు గురవడంతోనే ఖమ్మం నగరం వరద ఊబిలోకి చిక్కుకుందనే విమర్శలున్నాయి. గోళ్లపాడు నుంచి నిర్మించిన ఈ కాల్వ కాల్వొడ్డు, జూబ్లీక్లబ్, నగరంలోని ప్రధాన మార్గాల మీదుగా మున్నేరు వరకు ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కాల్వ ధ్వంసం ఫలితంగానే నేడు నగరవాసులు ముంపునకు గురయ్యారని ఆరోపణలొస్తున్నాయి. చాలా ఏళ్ల క్రితం సాగునీటి కాల్వగా ఉన్న గోళ్లపాడు చానల్ కాల్వ తర్వాత కాలంలో ఆక్రమణలకు గురై మురుగునీటి కాల్వగా మారిపోయింది.

పాలకులు పట్టించుకోకపోవడంతో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. ఫలితంగా కాల్వ ఆనవాళ్లు లేకుండా పోయింది. ఫలితంగానే మురుగునీరు పోయే మార్గం లేక వరద నగరవాసులను ముంచెత్తింది. గత ప్రభుత్వ హయాంలో కాల్వను ఆధునీకరణ పేరుతో మరింత కుదించారు. పై భాగాన్ని మూసివేసి, కింద పైపులు వేసి వదిలేశారు. కాల్వలో చెత్తా చెదారం పేరుకుపోయి మురుగు నీరు ముందుకు కదలని పరిస్థితి ఏర్పడింది. దీంతో వరదంతా నగరాన్ని ముంచివేసింది.