22-02-2025 07:34:44 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డు తగిలించడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పెట్రోల్ బంకులు నిరంతరం స్టాక్ ఉంచాల్సిన తరుణంలో యాజమాన్యం నిర్లక్ష్యంతో వినియోగదారులు ఇక్కట్ల పాలు అవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(Indian Oil Corporation) ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ పెట్రోల్ బంకు, పట్టణం ప్రధాన రహదారిపై ఉండాల్సింది. కానీ దాని లొకేషన్ మార్చి తర్లపాడు రోడ్డుపై పెట్టినప్పటంతో పట్టణ వినియోగదారులకు కొంతమేర ఇబ్బంది కలుగుతున్నప్పటికీ, నో స్టాక్ బోర్డుతో మరింత సమస్యగా మారిందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ప్రజల సంక్షేమార్థం పెట్రోల్ బంకులో పర్యవేక్షించాల్సిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, స్థానిక రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతోనే యాజమాన్యం స్టాక్ అయిపోయిందన్నారు. సమయానుకూలంగా పెట్రోల్, డీజిల్ అందుబాటులోకి తీసుకురాకపోవడం శోచనీయమని పలువురు వినియోగదారులు వాపోతున్నారు. దీంతో పలు వాహనదారులు దూర రాకపోకల సమయంలో నిరాశతో వెనుదిరిగాల్సి వస్తోందని, ఇకనైనా స్థానిక రెవెన్యూ అధికారులు పెట్రోల్ బంకులపై పర్యవేక్షణ ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.