calender_icon.png 5 October, 2024 | 6:47 AM

హైడ్రా కూల్చివేతలపై స్టే ఇవ్వం

05-10-2024 02:59:53 AM

కేఏ పాల్ పిల్‌పై తేల్చి చెప్పిన హైకోర్టు

ప్రభుత్వానికి నోటీసులు జారీ

హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): హైడ్రా కూల్చివేత చర్యలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయబోమని హైకోర్టు చెప్పింది. ప్రభుత్వ స్థలాలు, చెరువుల బఫర్‌జోన్స్, ఎఫ్టీఎల్ ప్రాంతాల్లో ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల కూల్చివేత చర్యలను నిలిపివేయాలంటూ ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ చేసిన అభ్యర్థనను తిరస్కరించింది.

చట్ట నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేతలు చేస్తున్నందున స్టే ఇవ్వాలంటూ వ్యక్తిగతంగా పాల్ వేసిన పిల్‌ను చీఫ్ జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావులతో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం విచారించింది. పాల్ వ్యక్తిగతంగా వాదించారు. చెరువుల రక్షణ చర్యలు అభినందనీయమని ఒప్పకున్నారు. అయితే ఆ చర్యలు చట్ట ప్రకారం ఉండాలన్నారు.

పేదలు,పెద్దల మధ్య వ్యత్యాసం ఉన్నందున హైడ్రా కూల్చివేతలను నిలిపివేస్తూ స్టే ఇవ్వాలని కోరారు. పేదల ఇళ్లను కూల్చేస్తున్న హైడ్రా సీఎం సోదరుడి ఇంటికి నోటీసు ఇచ్చి 30 రోజులైనా ఇప్పటివరకు కూల్చలేదని తెలిపారు. సర్వే చేసి ఆక్రమణలను గుర్తించాకే నోటీసులు ఇవ్వాలన్నారు. ఇళ్లను ఖాళీ చేయడానికి నెల రోజుల సమయం ఇవ్వాలని కోరారు.

ఇళ్లు కోల్పోయిన పేదలకు పరిహారంతోపాటు పునరావాసం ఇచ్చేలా రాష్ట్రానికి ఉత్తర్వులు జారీ చేయాలని విన్నవించారు. విచారణ ముగిసే వరకైనా హైడ్రాపై స్టే ఇవ్వాలని అభ్యర్థించారు. దీనిపై స్పందించిన హైకోర్టు, ఎవరి ఇళ్లను కూల్చుతున్నారో, ఎవరి ఇళ్లను కూల్చారో వివరాలు ఏమీ లేకుండా గాలిపోగేసి స్టే ఇవ్వాలంటే ఎలాగని ప్రశ్నించింది.

వివరాలు ఏమీ లేకుండా స్టే ఆర్డర్ అడిగితే ఇవ్వబోమని చెప్పింది. కచ్చితమైన అభ్యర్ధన ఉంటేనే ఉత్తర్వులు ఇవ్వగలమని స్పష్టంచేసింది. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు విన్న తర్వాతే తగిన ఉత్తర్వులు ఇవ్వగలమని చెప్తూ విచారణ వాయిదా వేసింది.  

హైడ్రా కేసులో మరో అధికారికి బెయిల్

హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): నిజాంపేట ప్రగతినగర్‌లోని ఎరక్రుంట చెరువు బఫర్‌జోన్, ఎఫ్టీఎల్‌లో అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన కేసులో హెచ్‌ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ అధికారి ఎం సుధీర్‌కుమార్‌కు హైకోర్టు శుక్రవారం ముందస్తు బెయిలు మంజూరు చేసింది.

ఇలాంటి కేసులోనే గతవారం ఒక అధికారికి హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. హైడ్రా ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ సుధీర్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ జువ్వాడి శ్రీదేవి విచారణ చేపట్టారు. పలు షరతులతో ముందస్తు బెయిల్ మంజూరు చేశారు.

దర్యాప్తునకు సహకరించాలని, 8 వారాలపాటు దర్యాప్తు అధికారులకు అందుబాటులో ఉండాలని ధర్మాసనం ఆదేశించింది. హైడ్రా ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో నిందితుడిగా ఉన్న జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ ఎన్ సుధాంషు దాఖలు చేసిన మరో పిటిషన్‌పై ఈ నెల 22న హైకోర్టు విచారణ చేయనుంది.