calender_icon.png 20 September, 2024 | 4:02 AM

బొగ్గు గనుల అమ్మకాలు వద్దు

20-07-2024 12:00:00 AM

జే.సీతారామయ్య :

చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు ముచ్చటగా మూడో సారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం బొగ్గు గనుల అమ్మకాలను ఎలాంటి శషభిషలు లేకుండా కొనసాగిస్తున్నది. మంత్రివర్గ విస్తరణలో తెలంగాణ రాష్ట్రం నుండి బొగ్గుగనుల శాఖమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిషన్‌రెడ్డి వెనువెంటనే బొగ్గు గనుల వేలానికి ముహూర్తం పెట్టి ప్రకటనలు చేశారు. మొట్టమొదటి ప్రకటనలోనే సింగరేణికి చెందిన గనులను వేలం వేస్తామని ప్రకటించారు. మోడీ ప్రభుత్వం గత రెండుసార్లు అధికారంలో ఉన్నప్పుడు దేశ సంపద, వనరులు, పరిశ్రమలు, అడవులను తన అప్తమిత్రులైన అంబానీ, అదానీ తదితర కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టింది. ప్రజలు ఈసారి ఎన్నికల్లో పూర్తి మెజారిటీ ఇవ్వకుండా ఓడించినా పనిలో పనిగా మిగిలిన దేశ సంపదలను సంపూర్ణంగా కార్పొరేట్లకు అప్పగించడమే లక్ష్యంగా తీసుకున్నట్లు అర్థం అవుతున్నది.

 అత్యంత ప్రమాదకరం

-----దేశ వ్యాప్తంగా 260 బొగ్గు గనులను మోడీ--- గత ప్రభుత్వం అమ్మకానికి సిద్ధం చేసింది. ఇందు కోసం 1952 నాటి బొగ్గు గనుల చట్టానికి సవరణ చేశారు. అంబానీ, అదానీ, అరబిందో, వేదాంత తదితర బడా కార్పొరేట్ సంస్థలకు అమ్మేందుకు పూనుకుంది. కార్పొరేట్లకు అప్పగించే గనులలో సింగరేణికి చెందిన జేవిఆర్ ఓసి (సత్తుపల్లి), కోయగూడెం ఓసి(టేకులపల్లి), శ్రావణపల్లి (శ్రీరాంపూర్), కళ్యాణఖని(మంచిర్యాల) ఉన్నాయి. కోయగూడెం ఓసి కోసం అరబిందో కంపెనీ ఇప్పటికే టెండర్లు వేసింది. సింగరేణికి చెందిన 4 బొగ్గు బావులను మోడీ ప్రభుత్వం బలిపీఠంపై పెట్టిన దానికి వ్యతిరేకంగా ఇక్కడి కార్మిక సంఘాలు ఆందోళనకు పూనుకున్నాయి. కార్మిక సంఘాలకు మద్దతుగా కేంద్ర కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, సీఐటీయూ, హెచ్ ఎంఎస్, ఐఎఫ్‌టీయూ, టీఎన్‌టీయూసీ తదితర సంఘాలు నడుం బిగించాయి. వారి ఆందోళనకు సంఘీభావంగా రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ముందుకు వస్తున్నాయి.

తరతరాలకు సరిపడే సంపద

తెలంగాణ ప్రాంతంలోని నాటి ఖమ్మం జిల్లాలో సింగరేణి గ్రామ సమీపాన 1871లో బాటసారుల ద్వారా తెలిసిన సమాచారం ఆధారంగా బ్రిటిష్ అధికారి విలియమ్ కింగ్ బొగ్గును కనిపెట్టాడు. దాంతో ఇల్లందులో 1889లో బొగ్గు తవ్వకాలను బ్రిటీష్ ప్రభుత్వం ప్రారంభిం చింది. బొగ్గుగుట్టలో(ఇల్లందుకు చుట్టూ బొగ్గుగుట్టలుగా ఉన్నందున అదే మారు పేరు) నాడు 25 వేలమంది కార్మికులు, 20 భూగర్భ గనులు ఉండేవి. నేడు రాష్ట్రంలో కొత్తగూడెం, ఖమ్మం, భూపాల పల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ మొత్తం 6 జిల్లాలకు సింగరేణి విస్తరించి బొగ్గు తవ్వకాలు జరుపుతున్నారు. సింగరేణిలో సర్వే చేసిన ప్రకారం 11,395 మిలియన్ టన్నుల బొగ్గు ఉంది. 2023 మార్చి నాటికి 1,686.74 మిలియన్ టన్నుల బొగ్గును తీశారు. అంటే, 135 ఏండ్లలో తీసిన బొగ్గు అతిస్వల్పం మాత్రమే. బొగ్గు సమృద్ధిగా ఉన్నందున మరో 804 ఏండ్లు ఇప్పటికే సర్వే చేసి ఉన్న బొగ్గును తీసుకోవచ్చు. గోదావరి పరీవాహక ప్రాంతంలో బొగ్గు సంపదను కనుగొని, వెలికి తీయడానికి ఎన్ని శతాబ్ద్దాలు పడుతుందో ఊహకు అందదు. 

సింగరేణి బొగ్గును ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, గోవా, చత్త్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాలకు పంపిస్తున్నది. తెలంగాణతోపాటు ఒడిశాలో బొగ్గు ఉత్పత్తిని సింగరేణి సంస్థ కొనసాగిస్తున్నది. కార్మికుల కష్టార్జితంతో వచ్చిన లాభాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నులు చెల్లిస్తున్నది. 2014 వరకు రూ. 23,446.19 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి, రూ.26,207.59 కోట్లు కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లించారు.ఒడిశా ప్రభుత్వానికి మరో 12.54 కోట్లు చెల్లించారు. ఒక ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న సింగరేణిని ఆదుకోక పోవడమే కాకుండా దానినుండి ఇంత పెద్దమొత్తంలో డబ్బు వసూలు చేస్తున్న ప్రభుత్వాలు ప్రైవేట్ సంస్థలకు అనేక రాయితీలు కల్పించి ఆదుకుంటున్నాయి. ఇదే విధంగా దేశవ్యాప్తంగా కోల్ ఇండియా ఆధీనంలో ఉన్న బొగ్గు ఉత్పత్తి సంస్థలన్నిటిలో అనేక వందల మిలియన్ టన్నుల బొగ్గును కనుగొన్నారు. 2021 జనవరి నాటికి కోల్ ఇండియా పరిధిలో 666 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి నిలువ ఉంచారు. దేశ అవసరాలకు సరిపడా బొగ్గును ఉత్పత్తి చేయడంలో కోల్ ఇండియా లక్ష్యం సాధించి విద్యుదుత్పత్తి సంస్థలకు అవసరమైన బొగ్గును సరఫరా చేస్తున్నది.

కార్పొరేట్ మిత్రుల కోసం..

---దేశ అవసరాలకు ఎంతో ఉపయోగపడుతున్న బొగ్గు గనులను అమ్మకానికి పెట్టాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. అపారమైన బొగ్గు నిల్వలు ఉన్నప్పటికీ నూతన గనులకు అనుమతి ఇవ్వకుండా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక ఆటంకాలు కలిగిస్తున్నది. కోల్ ఇండియా పరిధిలో 260 నూతన బొగ్గు గనులను తీసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నా  అటవీశాఖ పర్యావరణ అనుమతులు ఇవ్వడం లేదన్న కారణంతో కొత్త బావులను తవ్వకుండా అడ్డుకుంటున్నది. ప్రభుత్వరంగంలోని కోల్ ఇండియాకు అటవీశాఖ అనుమతి ఇవ్వలేక పోతే, ప్రైవేట్ సంస్థలైన అంబానీ, అదానీ, అరబిందో వంటి ప్రైవేట్ గనుల తవ్వకానికి ఎలా అనుమతి ఇవ్వడం జరుగుతుందనేది ఆలోచించాల్సిన విషయం. కోల్ ఇండియా ఉత్పత్తి చేసిన బొగ్గు ధర టన్నుకు 3 వేల రూపాయలు మించి రేటు పెంచరాదని ఆంక్షలు పెడుతున్న ప్రభుత్వం మరోవైపు అదాని బొగ్గును టన్నుకు 30 వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేయాలని విద్యుత్ సంస్థలకు ఆదేశాలిచ్చింది.  విద్యుత్తు చార్జీలను ప్రస్తుత రేట్లకంటే 12- శాతం వరకు పెంచుకోవడానికి అనుమతిస్తున్నది.

ఉద్యమాలకు సిద్ధమవుదాం

దేశానికి, ప్రజలకు నష్టం చేసే ఏ నిర్ణయం అయినా దేశ ద్రోహం, ప్రజా ద్రోహం అవుతుంది. సింగరేణి వందల కోట్ల రూపాయలు ఖర్చుచేసి బొగ్గును కనుగొన్న ప్రాంతంలో ఈ రోజున ఒక్క పైసా ఖర్చు లేకుండా అంబానీ, అదానీ, అరబిందో, వేదాంత తదితర కంపెనీలకు అప్పగించేందుకు మోడీ ప్రభుత్వం సిద్ధపడింది. గత 30 ఏళ్లుగా వరుసగా లాభాలను సాధించి, అందులో కార్మికులకు వాటా ఇస్తున్న సింగరేణికి కొత్త బావులు తీసుకునే అవకాశం లేకుండా చేయడమేకాక ఈ ప్రాంతంలోని నాలుగు బొగ్గు బావులను అమ్మకానికి పెట్టడం, టెండర్లలో సింగరేణి కూడా పాల్గొనాలని నిర్ణయించడం దుర్మార్గ చర్య. గతంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా తాడిచర్ల, పునుకుడు చెలక, పెనుగడప తదితర 7 బొగ్గు బ్లాక్‌లను క్యాప్టివ్ మైన్స్ పేరుతో ప్రైవేటీకరణ చేయటానికి నిర్ణయం తీసుకున్నప్పుడు సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేసి వెనక్కి  తీసుకునేలా చేశారు. అలాగే, 2001లో కోయగూడెం ఓపెన్ కాస్ట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 17 రోజులు కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు సమ్మె చేశాయి. 

ఇప్పుడు కోల్ ఇండియా పరిధిలో 260 బొగ్గు బావులను అమ్మేందుకు చూస్తున్న మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక, ప్రజావ్యతిరేక చర్యలపై దేశవ్యాప్తంగా బొగ్గుగని కార్మికులు ఉద్యమించాలి. దీనిని దేశవ్యాప్త సమస్యగా భావించి అందరినీ ఉద్యమంలో భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉంది. నేడు సింగరేణి గని కార్మికులతో పాటు దేశంలోని కోల్ ఇండియా పరిధిలోని అన్ని బొగ్గు సంస్థల కార్మికులను ఉద్యమానికి సిద్ధం చేయాలి. పార్లమెంటులో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్నిపార్టీల సభ్యుల మద్దతును కూడగట్టి బొగ్గు బావుల రక్షణకు పూనుకోవాలి. బొగ్గు గనుల అమ్మకానికి వ్యతిరేకంగా ఇప్పటికే సింగరేణిలో కార్మిక సంఘాలు ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నాయి. దీనిని మరింత ఉద్ధృతం చేయాల్సిన అవసరం ఉంది.

వ్యాసకర్త జనరల్ సెక్రటరీ,

గోదావరి లోయ బొగ్గుగని 

కార్మిక సంఘం(ఐఎఫ్‌టీయూ) 

సెల్: 9490700954