- దయనీయంగా అతిథి అధ్యాపకుల పరిస్థితి
- ఏడాదికోసారి వేతనాల చెల్లింపు
- ఉద్యోగ భద్రత హామీ హుష్‌కాకి..
- కాంగ్రెస్ మేనిఫెస్టో హమీ అమలు చేయాలని లెక్చరర్ల డిమాండ్
జనగామ, నవంబర్ 20 (విజయక్రాంతి): రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా విధులు.. బోధనలో ఏమాత్రం తగ్గని పనితనం.. అయినా వారిపై ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతోంది. సమయానికి వేతనాలు అందించకుండా అతిథి అధ్యాపకులను అరిగోస పెడుతోంది.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వారిని చీపురుపుల్లల్లా చూస్తే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకైనా తమ బతుకులు మారుతాయని ఆశించిన గెస్ట్ లెక్చరర్లకు నిరాశే మిగులుతోంది. చేస్తున్న పనితో ఇల్లు గడవక.. మరో పని చేయలేక అతిథి అధ్యాపకులు నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్నారు. దశాబ్ద కాలంగా వీరికి ఏడాదికోసారి జీతాలు ఇస్తూ వస్తున్నారు.
దీంతో సంసారం చిన్నాభిన్నమై దయనీయ స్థితిలో బతుకు వెళ్లదీస్తున్నారు. రాష్ట్రమంతా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఓ వైపు జీతం సమయానికి రాకపోగా, మరోవైపు తమను రెగ్యులర్ చేస్తామన్న ప్రభుత్వాల హామీ నెరవేరక ఆందోళన చెందుతున్నారు.
ఉద్యోగ భద్రత కల్పిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీపై ఇంతవరకు అడుగు ముందుకుపడకపోవడంతో ఎటూ పాలుపోని పరిస్థితిలో అతిథి అధ్యాపకులు ఉన్నారు.
ఇటీవల తన ఉద్యోగం ఉంటుందో పోతుందోనన్న ఆందోళనతో కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి జూనియర్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్‌గా పనిచేస్తున్న రాధాకు బెయిన్‌స్ట్రోక్ వచ్చింది. ఇలా చాలా మంది మానసికంగా ఆందోళన చెందుతున్నామని అధ్యాపకులు చెబుతున్నారు.
12 సంవత్సరాలుగా బోధన..
జనగామ జిల్లాలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొత్తం 42 మంది గెస్ట్ లెక్చరర్లు విధులు నిర్వహిస్తున్నారు. 12 ఏళ్లుగా వీరు పాఠాలు బోధిస్తున్నారు. మొదటి నుంచి వీరికి వేతనాలు చెల్లింపుల్లో చాలా ఆలస్యం జరుగుతోంది. ఏడాదికోసారి, పది నెలలకోసారి వేతనాలు చెల్లిస్తుండటంతో కుటుంబ పోషణ భారంగా మారుతోంది.
రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా వీరు విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అతిథి అధ్యాపకులు ఒకరు నెలకు 72 పీరియడ్లు బోధించాల్సి ఉంటుంది. అలా అయితేనే మొత్తం జీతం వస్తుంది. ఇప్పటికైతే నెలకు రూ.28 వేల చొప్పున వేతనం అందిస్తున్నారు.
నెల మొత్తం కాలేజీ నడిస్తేనే వారికి ఈ జీతం ఇస్తారు. ఒకవేళ ఏమైనా సెలవులు వస్తే జీతంలో కోత పడుతుంది. పండుగ సెలవులు, ప్రభుత్వ సెలవుల్లోనూ మినహాయింపు ఉండదు. ఏడాదిలో 7 నుంచి 8 నెలల జీతం మాత్రమే అందుకుంటారు. ఈ జీతం కూడా సమయానికి ఇవ్వకపోవడంతో ఉద్యోగాలు చేయలేకపోతున్నారు.
పోరాటానికి సన్నద్ధం..
వచ్చే అరకొర జీతం కూడా సమయానికి రాకపోవడంతో గెస్ట్ లెక్చరర్ వృత్తిపై విసుగు చెందుతున్నారు. కానీ దశాబ్ద కాలంగా పనిచేస్తుండటంతో ఎలాగైనా తమ ఉద్యోగం రెగ్యులరైజ్ చేస్తారన్న ఆశతో మరో పనికి ఎక్కడం లేదు. ఓ వైపు రెగ్యులర్ కాక.. మరోవైపు వచ్చే జీతం సరిగ్గా రాక మనోవేదనకు గురవుతున్నారు.
దేవుడు కరుణించిన పూజారి కనుకరించలేదు అన్నట్లుగా ప్రభుత్వం జీతాల కోసం నిధులు విడుదలు చేసినా ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం వల్లే వీరికి సమయానికి వేతనాలు అందడం లేదని తెలుస్తోంది. జనగామ జిల్లాలో ప్రస్తుతం ఆరు నెలల నుంచి జీతం రాకపోవడంతో అతిథి అధ్యాపకులు పోరుబాట పట్టారు.
ఇప్పటికే తమ సమస్యలపై డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహా, సీతక్క, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలను కలిసి విన్నవించారు.
తమకు ఉద్యోగ భద్రత కల్పించడమే కాకుండా నెలకు రూ.41 వేల వేతనం ఇస్తామన్న కాంగ్రెస్ హామీని నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
కుటుంబ పోషణ భారంగా ఉంది
సమయానికి వేతనం రాక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఏడాదికోసారి జీతం ఇస్తే అవసరాలు ఎలా తీరుతాయి. మా ఉద్యోగానికి భద్రత లేదు. ఇచ్చే జీతం సరిగ్గా ఇవ్వడం లేదు. ఎన్నికల సమయంలో మాకు అండగా ఉంటామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే ఉద్యోగ భద్రత కల్పించడమే కాకుండా నెలకు రూ.41 వేల జీతం ఇస్తామని చెప్పారు. ఈ హామీలను నిలబెట్టుకుంటు ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
స్రవంతి, గెస్ట్ ఫ్యాకల్టీ, జనగామ