calender_icon.png 17 January, 2025 | 7:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిఫండ్ల కోసం రిస్క్ వద్దు

29-07-2024 01:13:28 AM

  1. పన్ను చెల్లింపుదారులకు ఇన్‌కమ్ ట్యాక్స్ హెచ్చరిక
  2. బోగస్ వ్యయాలు, పన్ను కోతలు, తక్కువ ఆదాయం చూపడం వంటివి శిక్షార్హమని వెల్లడి

న్యూ ఢిల్లీ, జూలై 28: పన్ను చెల్లింపుదారులు రీఫండ్ల కోసం ఐటీఆర్‌లో తప్పుడు సమాచారం ఇవ్వొద్దని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ హెచ్చరించింది. బోగస్ వ్యయాలు, ఆదాయాలను తక్కువ చేసి చూపడం, అధికంగా పన్ను కోతలను చూపించడం వంటివి శిక్షార్హమైన నేరాలని డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది. ముందుగా రీఫండ్ ఆలస్యమైతే తొలుత ఈ అకౌంట్‌ను చెక్ చేసుకోవాలని సూచించింది.

ఏమైనా అభ్యంతరాలుంటే ఐటీఆర్ పోర్టల్‌లో పెండింగ్ యాక్షన్ వర్క్‌లిస్ట్ సెక్షన్ కింద స్పందనను తెలియజేయాలని సూచించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రీఫండ్ల గడువును 30 నుంచి 60 రోజులకు పెంచిన విషయం తెలిసిందే. అయితే ఇలా ఆలస్యమయ్యే సందర్భాలు చాలా తక్కువని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ రవి అగర్వాల్ తెలిపారు. ఐటీఆర్ సమీక్ష పూర్తయిన 30 రోజుల్లోగా రీఫండ్ జమఅవుతుందని  స్పష్టం చేశారు. వెసులుబాటు కోసమే 60 రోజుల ఆప్షన్ ఇచ్చినట్లు తెలిపారు. 

5కోట్ల ఐటీఆర్‌లు దాఖలు..

ఆడిట్ అవసరం లేని పన్ను చెల్లింపుదారులు రిటర్న్‌లను జూలై 31 కల్లా సమర్పించాల్సి ఉండగా.. జూలై 26 నాటికి దేశవ్యాప్తంగా దాదాపు 5కోట్ల ఐటీఆర్‌లు దాఖలైనట్లు సీబీడీటీ తెలిపింది. రీఫండ్ల క్లెయిమ్‌లు తనిఖీలకు లోబడి ఉంటాయని.. ఒక్కోసారి అవి ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. క్లెయిమ్‌లో ఏవైనా తేడాలుంటే ‘రివైజ్డ్ రిటర్నుల’ కోసం దాఖలు చేయాలని అధికారులు కోరారు. పాతపన్ను విధానంలో ఐటీఆర్ దాఖలు చేసేవారికి పలురకాల రాయితీలు, మినహాయింపులు ఉండటంతో రీఫండ్‌ను క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ కొత్త పన్ను విదానంలో ఎలాంటి క్లెయిమ్‌లకు చాన్స్ ఉండదు.  వీరికి పన్నురేట్లు మాత్రం తక్కువగా ఉంటాయి.