calender_icon.png 17 November, 2024 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బియ్యం వద్దా.. నగదు తీస్కో!

10-11-2024 12:00:00 AM

  1. లబ్ధిదారులను ప్రోత్సహిస్తున్న రేషన్ డీలర్లు 
  2. పాలమూరు జిల్లాలో యథేచ్ఛగా దందా 

మహబూబ్‌నగర్, నవంబర్ 9 (విజయక్రాంతి): మహబూబ్‌నగర్ జిల్లాలోని కొన్ని రేషన్ షాపుల్లో నగదు దందా జోరుగా సాగుతున్నది. రేషన్ షాపుల్లో బియ్యం తీసుకోవడం ఇష్టంలేని లబ్ధిదారుల వేలిముద్రలు తీసుకుని, బియ్యానికి సరిపడా నగదును డీలర్లే చేతిలో పెడుతారు. ఆ తర్వాత బియ్యాన్ని రేషన్ డీలర్లే పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి. 

ప్రతి నెల 4,300 మెట్రిక్ టన్నుల బియ్యం..

జిల్లా వ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులకు ప్రతి నెల దాదాపు 4,300 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ఈ మేరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సివిల్ సప్లు గోదాంల నుంచి నేరుగా రేషన్ షాపులకు సరఫరా చేస్తుంది. రేషన్ షాపులకు బియ్యం చేరుతున్నప్పటికీ రేషన్ షాపుల నిర్వహణను మాత్రం సంబంధింత అధికారులు గాలికి వదిలేశారనే ఆరోపణలు ఉన్నాయి. రేషన్ బియ్యం వద్దనుకునే లబ్ధిదారులు డీలర్లు ఇచ్చే నగదు తీసుకుని, బియ్యాన్ని వారికే వదిలేస్తున్నారు. 

బియ్యం ఎటు పోతున్నది

రేషన్ షాపులకు బియ్యం చేరుతున్నా అక్కడ నగదు విధానాన్ని కొందరు రేషన్ డీలర్లు అవలంభిస్తుండటంతో బియ్యం ఎటు పోతున్నాయనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. దీంతో అసలు గోదాం నుంచి రేషన్ బియ్యం సరఫరా సక్రమంగా జరుగుతుందా, అక్కడే సర్దుబాటు చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. 

క్రమం తప్పకుండా బియ్యం సరఫరా 

జిల్లా వ్యాప్తంగా ప్రతి నెల 4,300 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అవుతున్నాయి. కొందరు లబ్ధిదారులు బియ్యం తీసుకోకపోతే సరఫరాలో కొంత వ్యత్యాసం ఉంటుంది. ప్రతి నెల క్రమం తప్పకుండా సమయ పాలన ప్రకారం రేషన్ షాపులకు బియ్యం మాత్రం సరఫరా చేస్తున్నాం. 

ఇర్ఫాన్, డీఎం, మహబూబ్‌నగర్