పేపర్ లీకేజీ వాస్తవమే
కానీ దేశవ్యాప్తంగా పరీక్ష పవిత్రత దెబ్బతినలేదు
సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్
న్యూఢిల్లీ, జూలై 23: నీట్ పేపర్ లీకైన మాట వాస్తవమేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ అంశంలో విచారణ ముగిసిన నేపథ్యంలో భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. జార్ఖండ్‌లోని హజారీబాగ్, బీహార్‌లోని పాట్నా కేంద్రాల్లో పేపర్ లీకైన మాట వాస్తవం. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది.
ఇందులో 155 మంది అభ్యర్థులు లబ్ధిపొందారు. వీరిపై చర్యలు తీసుకోవాలి. కానీ, పరీక్ష పవిత్రత దెబ్బతిందని చెప్పేందుకు సరైన ఆధారాలు లేవు. వ్యవస్థ మొత్తానికి ఇందులో భాగస్వామ్యం లేదు. ఆ దిశగా నిర్ధారణకు రావడం కష్టం. మళ్లీ పరీక్ష పెడితే 24 లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడుతారు అని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. నీట్‌లో అక్రమాలు జరిగాయంటూ కొన్ని విద్యాసంస్థలతో పాటు వ్యక్తిగత పిటిషన్లను సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.
ఫస్ట్ బయటికి తీసుకెళ్లండి
సుప్రీంకోర్టులో నీట్‌పై వాదనల సందర్భంగా సీనియర్ న్యాయవాది మ్యాథ్యూస్ నెడుంపరాపై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ సందర్భంగా పలుసార్లు అంతరాయం కలిగించడంతో అసహనం వ్యక్తం చేసిన సీజేఐ బలవంతంగా కోర్టు బయటికి పంపాలని భద్రతా సిబ్బందిని ఆదేశించారు. పిటిషనర్ల తరఫున మరో సీనియర్ న్యాయవాది నరేందర్ హుడా మాట్లాడుతుండగా.. తానూ ఓ విషయం చెప్పాలంటూ మ్యాథ్యూస్ పలుమార్లు కోరారు. సీనియర్ న్యాయవాది హుడా వాదిస్తున్న సమయంలో ఆయనకు అంతరాయం కలిగించవద్దు అంటూ సీజేఐ స్పష్టం చేశారు. దీంతో తానే ఇక్కడ సీనియర్‌ను అని మ్యాథ్యూస్ అనడంతో సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. మీరు గ్యాలరీని ఉద్దేశించి మాట్లాడకూడదు. నేను చెప్పేది వినాలి. ఈ కోర్టుగదికి నేనే ఇన్‌చార్జి. మీరు ఇక్కడ ఇవ్నీ మాట్లాడకూడదు.24 ఏళ్లుగా న్యాయవ్యవస్థలో ఉన్నా. కోర్టులో న్యాయవాదులు విధివిధానాలను నిర్దేశించడాన్ని నేను అనుమతించను. అని సీజేఐ ఆదేశించారు. సీజేఐ మాట్లాడుతుండగానూ అభ్యంతరం వ్యక్తం చేస్తూ నేనూ 1979 నుంచి చూస్తున్నానని మ్యాథ్యూస్ వ్యాఖ్యానించడం గమనార్హం. చివరగా తనను క్షమించాలని మ్యాథ్యూస్ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. నీట్ పరీక్షలో అక్రమాలతో మళ్లీ ఎక్కడ పరీక్ష రాయాల్సి వస్తుందోనని దేశవ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
మంగళవారం సుప్రీంకోర్టు తీర్పుతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. తప్పులు చేసిన విద్యార్థులను మాత్రమే శిక్షిస్తామని చెప్పడంతో తెలంగాణకు చెందిన విద్యార్థులకు సైతం ఊరట లభించింది. రీటెస్ట్ రాయాలంటే అదో నరకంగా చాలా మంది విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. కష్టపడి రాశామని మరోసారి రాసేందుకు సిద్ధంగా లేమంటున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పు నీట్ కౌన్సిలింగ్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు తీపి కబురు లాంటిదే. 2024లో 79,813 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 77,849 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 47,371 మంది క్వాలిఫై అయ్యారు.