calender_icon.png 21 September, 2024 | 8:58 PM

వానకాలం ధాన్యం వద్దు!

20-09-2024 12:16:22 AM

  1. మెదక్ జిల్లాలో రైస్ మిల్లర్ల నిర్ణయం?
  2. గిట్టుబాటు కాక నష్టపోతున్నామని చెబుతున్న అసోసియేషన్ 
  3. రాష్ట్రశాఖ నిర్ణయంపైనే కార్యాచరణ

మెదక్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): మెదక్ జిల్లాలో వానకాలం ధాన్యం కొనుగోళ్లకు యంత్రాంగం నిమగ్నమవుతుండగా, రైస్ మిల్లుల్లో మాత్రం ఈ దఫా తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. సన్నరకం ఎక్కువగా సాగు కావడం వల్ల కస్టం మిల్లింగ్ నిబంధనల ప్రకారం బియ్యం ఇవ్వడం సాధ్యం కాదని వారు భావిస్తున్నారు. వానకాలంలో ధాన్యం కొనుగోలు చేయగానే మిల్లులకు పంపించవద్దని అధికారు లకు విన్నవించేందుకు మిల్లర్లు సిద్ధమవుతున్నారు.

ధాన్యం తీసుకునే విషయంలో మిల్లర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ఈ దఫా ధాన్యం తీసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో పాటు పాత టార్గెట్లన్నీ పూర్తిచేసిన తర్వాతనే తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది. జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల కోసం ముందస్తుగానే అధికారులు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. జిల్లాలో వరి సాగు విస్తీర్ణం బట్టి దిగుబడి వచ్చే ధాన్యానికి అనుగుణంగా కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రతి సీజన్‌లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు కేటాయిస్తున్నారు.

నిబంధనల ప్రకారం కస్టం మిల్లింగ్ చేసే ధాన్యాన్ని మిల్లర్లు అప్పజెప్పాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్వింటాల్ ధాన్యానికి 67 కిలోల బియ్యాన్ని అందించాలి. ప్రతి సీజన్‌లోనూ ఇదే విధంగా కేటాయింపులు చేసి నిర్ణీత సమయంలో బియ్యాన్ని మిల్లర్లు కస్టం మిల్లింగ్ కింద ఎఫ్‌సీఐకి పెట్టే విధంగా చూస్తున్నారు. మూడేళ్లుగా ధాన్యం కేటాయింపులు చేసిన కొన్ని మిల్లుల నుంచి కస్టమ్ మిల్లింగ్ కింద బియ్యాన్ని అందించలేదు.

జిల్లా అధికారులు కేటాయించిన ధాన్యం కూడా వారి వద్ద నిల్వ లేదు. కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానమైన మిల్లుల్లో తనిఖీ చేయగా ఈ విషయం బయటపడింది. రాష్ట్రవ్యాప్తంగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్‌ల ద్వారా ఈ తనిఖీలను చేపట్టారు. జిల్లాలో కూడా పలు మిల్లుల్లో ఈ ధాన్యం పక్కదారి పట్టినట్లు గుర్తించారు. పలువురు మిల్లర్లపై కేసులు నమోదు చేశారు. 

మెదక్ జిల్లాలో 164 రైస్‌మిల్లులు..

జిల్లాలో మొత్తం 164 వరకు రైస్‌మిల్లులు ఉన్నాయి. ఇందులో 132 రా రైస్‌మిల్లులు ఉండగా, 32 బాయిల్డ్ రైస్‌మిల్లులు ఉన్నాయి. వీటిలో రెండు నుంచి ఆరు టన్నుల వరకు కెపాసిటీ మిల్లులు ఉన్నాయి. ఈ మిల్లుల కెపాసిటీ  ఆధారంగా అధికారులు ధాన్యం కేటాయింపులు చేస్తున్నారు. ధాన్యం కస్టమ్ మిల్లింగ్ చేసేందుకు కమిషన్ ఇస్తున్నారు. ప్రతి ఏడాది కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని మిల్లులకు కేటాయిస్తున్నా, కస్టమ్ మిల్లింగ్ విషయంలో తమకు సమస్యలు ఎదురవుతున్నాయని మిల్లర్లు చెబుతున్నారు.

ఎండిన ధాన్యాన్ని ఇవ్వకపోవడం, తడిసిన ధాన్యం, పచ్చి ధాన్యం పంపించడం వల్ల నిబంధనల ప్రకారం కస్టమ్ మిల్లింగ్ కింద బియ్యం రావడం లేదని వారు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ దఫా ముందుగానే మిల్లులకు  ధాన్యం కేటాయింపులు జరపొద్దని కోరుతున్నారు. అంతేగాకుండా ఈ ఏడాది సన్నరకాలు ఎక్కువగా సాగు చేసినందున, నిబంధనల ప్రకారం క్వింటాల్‌కు 67 కిలోలు రావని, తక్కువగా వస్తుందని వారు చెబుతున్నారు. 

గిట్టుబాటు కావడం లేదు

నిబంధనల ప్రకారం క్వింటాల్‌కు 67 కిలోలు మిల్లర్లకు గిట్టుబాటు కావడం లేదు. కస్టమ్ మిల్లింగ్ చేసిన తర్వాత నిబంధనల ప్రకారం బియ్యం రాకపోవడం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఇతర ప్రాంతాల నుంచి ధాన్యం కొనుగోలు చేసి తీసుకొచ్చి మిల్లింగ్ చేసి అందిస్తున్నాం. అలాగే 20 ఏళ్ల క్రితం నుంచి ఉన్న మిల్లింగ్ ఛార్జీలను పెంచడం లేదు. వంద క్వింటాళ్ల ధాన్యానికి రూ.వెయ్యి చెల్లిస్తున్నారు. ఇది ఏమాత్రం సరిపోదు. గిడ్డంగులలో స్టోరేజీ సమస్య వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. 2022-23 సీజన్ ప్యాడీ యాక్షన్ అయినప్పటికీ మిల్లుల నుంచి లిఫ్ట్ చేయడం లేదు. దీంతో స్టోరేజీ సమస్య ఏర్పడుతుంది. వానకాలం సీజన్ ధాన్యం తీసుకునే విషయంలో రాష్ట్ర శాఖ నిర్ణయం మేరకు కార్యాచరణ ఉంటుంది. 

 ఉట్కూరి వీరేశం, 

జిల్లా రైస్‌మిల్లర్ల సంఘం అధ్యక్షుడు