calender_icon.png 17 November, 2024 | 3:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదేళ్లలో ఏ పాలసీ లేదు

09-09-2024 05:43:29 AM

  1. ఒక్కొక్కటి చక్కబెట్టుకుంటూ వస్తున్నాం 
  2. జర్నలిస్టులు సమాజానికి చికిత్స చేసే డాక్టర్లు 
  3. నిజమైన జర్నలిస్టులకు నష్టం జరగకుండా చూస్తం 
  4. హెల్త్, అక్రిడేషన్ కార్డుల సమస్యల పరిష్కారానికి నూతన విధానాలు 
  5. మీడియా అకాడమీకి 10కోట్లు 
  6. జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు 
  7. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 
  8. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు అప్పగింత 

హైదరాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): గత పదేళ్ల బీఆర్‌ఎస్ హయాంలో టూరిజం, ఎనర్జీ, స్పోర్ట్స్‌తో పాటు ఇతర అంశాల్లో తెలంగాణకు ఎలాంటి పాలసీలు లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పాలసీలు లేకపోవడం కుడా గత ప్రభుత్వం పాలసీగా భావించిందని విమర్శించారు. అలాంటి స్థితి నుంచి ఒక్కొక్కటి చక్కబెట్టుకుంటూ వస్తున్నామని వివరించారు. ఆదివారం రవీంద్రభారతిలో జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ (జేఎన్‌జేహెచ్‌ఎస్)కు పేట్ బషీరాబాద్‌లో కేటాయించిన 38 ఎకరాల భూమి స్వాధీన పత్రాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

జర్నలిస్టులు సమాజానికి చికిత్స చేసే డాక్టర్లుగా భావించి నాడు వైఎస్‌ఆర్ ఇళ్ల స్థలాలను కేటాయించారని చెప్పారు. నాడు కేటాయించిన స్థలాల సమస్యకు తమ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిందన్నారు. ప్రజాభిప్రాయం, జర్నలిస్టుల సూచనలతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. వ్యవస్థలపై నమ్మకం పెంచాలన్నదే తమ సర్కారు విధానమన్నారు. జర్నలిజం కూడా వ్యవస్థల్లో ఒక భాగమే అని అన్నారు. నాడు రాజాకీయ పార్టీలు సిద్ధాంత భావజాల వ్యాప్తి కోసమే పత్రికలు ఏర్పాటు చేసుకునేవని గుర్తు చేసారు. కానీ ఇప్పుడు కొందరు కేవలం రాజకీయ పార్టీల యజమానులను రక్షించేందుకే ప్రాధాన్యతనిస్తున్నారన్నారు.

కొందరు ఉన్మాద ధోరణితో వ్యవహరించే పరిస్థితులు దాపురించాయన్నారు. కొంతమంది జర్నలిస్టు అనే పదం అర్ధాన్నే మార్చేస్తున్నారని దుయ్యబట్టారు. అలాంటి వారిపై తీసుకునే చర్యలను నిజమైన జర్నలిస్టులు ఆపాదించుకోవద్దని సూచించారు. కొందరు చేసే పనులతో జర్నలిస్టులందరికీ చెడ్డపేరు వస్తోందన్నారు. నిజమైన జర్నలిస్టులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రస్తుతం అసలు జర్నలిస్టుల కంటే.. కొసరు జర్నలిస్టుల వ్యవహారమే ఎక్కువైందని దుయ్యబట్టారు. ఎవరిని జర్నలిస్టుగా చూడాలో మీడియా ప్రతినిధులు, సంఘాలే తేల్చాలన్నారు. భాష విషయంలోనూ కొన్ని పత్రికలు గీత దాటుతున్నాయని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హోదానూ కూడా అవమానపరిచేలా వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. 

మీడియా అకాడమీకి రూ.10 కోట్లు

ప్రజల సమస్యలను వెలికితీసే జర్నలిస్టులు ఒకవర్గం అయితే.. ఓ రాజకీయ పార్టీ యజమానిని రక్షించడానికి మరో వర్గం పనిచేస్తోందని సీఎం అన్నారు. రెండు వర్గాలను కలపడం వల్ల నిజమైన జర్నలిస్టుకు నష్టం జరుగుతుందని సీఎం అన్నారు. ఆరోగ్య భద్రత కార్డులు, అక్రిడిటేషన్ ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం మీడియా అకాడమీ కొత్త విధి విధానాలు తయారు చేయాలని సీఎం ఆదేశించారు. వాటికి కేబినెట్ ఆమోదం తెలిపే బాధ్యతను తాము తీసుకుంటామన్నారు. మీడియా అకాడమీకి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి రూ.10కోట్లు ఇస్తున్నామన్నారు. ఇళ్ల స్థలాల విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దని, అరులైన వారికి ఫ్యూచర్ సిటీలో ఇస్తామని చెప్పారు.

మండల, జిల్లాస్థాయిలో పనిచేసే జర్నలిస్టులకు కూడా ఇవ్వాలి: పొన్నం

చాలా కాలంగా వేచి చూస్తున్న  జర్నలిస్టుల సమస్యకు ముగింపు పలికిన సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. తమ ప్రభుత్వం అందరి అభిప్రాయాలను తీసుకుంటుందని, ఒకరు చెప్పిందే వినాలనే పార్టీ తమది కాదన్నారు. మండల, జిల్లాస్థాయిలో పనిచేసే జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సూచించారు.

వరదలో బురద రాజకీయాలు: మంత్రి పొంగులేటి  

జర్నలిస్టులను అవమానించిన సందర్భాలు గత ప్రభుత్వం హయాంలో ఉండేవని, కానీ ఇందిరమ్మ సర్కారులో అలా ఉండదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వంపై ఎలాంటి అనుమానాలు ఉన్నా నేరుగా అడగొచ్చన్నారు. హైడ్రాపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. బీఆర్‌ఎస్ మాత్రం బురద రాజకీయాలు చేస్తోందన్నారు. ప్రజలు రెండుసార్లు కర్రు కాల్చి వాత పెట్టినా వారికి బుద్ధి రాలేదన్నారు. కార్యక్రమంలో ఎంపీలు చామల కిరణ్, అనిల్ కుమార్ యాదవ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి,  మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి, జర్నలిస్టు సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.