17-04-2025 11:34:50 PM
నిజంగా ప్రాణహాని ఉంటేనే రక్షణ కల్పిస్తాం
అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు
ప్రయాగ్‌రాజ్: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకునే ప్రేమ జంటలు పోలీసుల రక్షణ కోరవద్దంటూ అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నిజంగానే ప్రాణహాని ఉంటే తప్ప, తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నోళ్లకు పోలీసుల రక్షణ అడిగే హక్కు లేదని తెలిపింది. తమకు పోలీసుల రక్షణ కల్పించాలని కోరుతూ శ్రేయ కేసర్వాని దంపతులు దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం విచారించిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెల్లడించింది. రక్షణ తప్పనిసరి అనిపించిన కేసులకు మాత్రమే పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని.. మిగతా వాళ్లు మాత్రం సమస్యలను ఎదుర్కొనేందుకు ఒకరినొకరు సహకరించుకోవాలని పేర్కొంది. గతంలో సుప్రీంకోర్టు ఇదే తరహా కేసులో తీర్పునిచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. సుప్రీం తీర్పు ఆధారంగా తాజా పిటిషన్‌పై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదన్నారు. శ్రేయ కేసర్వాని కేసులో పిటిషనర్ల జీవితానికి, స్వేచ్ఛకు ప్రమాదం ఉందని చెప్పేందుకు ఒక్క కారణం కూడా లేదని హైకోర్టు తెలిపింది. నిజంగా ముప్పు ఉండే కేసులకు మాత్రమే హైకోర్టు భద్రత కల్పిస్తుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అనంతరం శ్రేయ కేసర్వాని దంపతులు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది.