ప్రపంచ మత్స్యకార దినోత్సవంలో ఎంపీ ఈటల
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబరు 21 (విజయక్రాంతి): రాష్ట్రంలో మత్స్యకారుల జనాభా పెద్ద సంఖ్యలో ఉన్నా, ఓట్ల సమయంలో వాడుకోవడం తప్పా.. రాజకీయం గా మమ్మల్ని ఏ పార్టీ ప్రోత్సహించలేదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. రాజకీయాల్లో ఇప్పుడున్న వారంతా ఎవరికి వారే స్వతహాగా ఎదిగిన వారేనన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం జరిగిన కార్యక్రమానికి ఎంపీ ఈటల ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
దేశంలో మత్స్య సంపద కొన్ని లక్షల కోట్లు ఉన్నందువల్లే మోదీ ప్రభుత్వం ప్రత్యేకంగా మత్స్యశాఖను ఏర్పాటు చేసి, వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్టు తెలిపారు. మత్స్యకారులు కూడా సహకార సంఘాలను ఏర్పాటు చేసుకొవాలని సూచించారు. ముదిరాజ్, బంటు, ముత్తరాసి, గంగపుత్ర, బెస్త, గోండు ఇలా పేరు ఏదైనా చేపలు పట్టే వృత్తిని నమ్ముకొని బతికే కులవృత్తులు కనుమరుగు అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
మత్స్య సంపదను నమ్ముకొని బతికే వారందరికీ ఎలాంటి నిబంధనలు లేకుండా సభ్యత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎల్‌ఎండీ, మల్లన్న సాగర్‌లో ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ పెట్టేందుకు ప్రయత్నించగా.. దాన్ని ఆపేందుకు ఎంతో పోరాటం చేశామమన్నారు. మత్స్యకారులకు అండగా ఉండటమే కాకుండా, ఢిల్లీలోని ఎన్‌ఎఫ్‌డీసీ బోర్డుకు తీసుకెళ్తానన్నారు.