రైతులు రోడ్లపై ధాన్యం ఆరపెట్టుకోవడం అనేక ప్రాంతాలలో సర్వసాధారణమై పోయింది. పెద్దగా ట్రాఫిక్ లేని రహదారుల్లో అయితే దీనివల్ల ఎవరికీ ఏ సమస్యా ఉండదు. కానీ, పొద్దస్తమానం వాహనాలతో రద్దీగా వుండే ప్రధాన రహదారుల్లోనూ ఇలా ధాన్యం ఎండ పోయడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుంది. ఉదా॥కు హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం శనిగరం గ్రామం నుండి పరకాలకి వెళ్ళే ప్రధాన రహదారిమీద సుమారు అర కిలో మీటరు దూరం వరకు ధాన్యపు కుప్పలు కనిపిస్తున్నాయి. దీనివల్ల ఈ మార్గంలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. కుప్పల పక్కన పెద్దపెద్ద బండలు కూడా పెడుతున్నారు. గతేడాది ఇదే ప్రదేశంలో కారు ప్రమాదం జరిగి నలుగురు మృత్యువాత పడ్డారు. పోలీసు శాఖ, ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులు స్పందించి రోడ్డుమీది ధాన్యపు కుప్పలను తొలగించేలా చర్యలు తీసుకోవాలి.
- కామిడి సతీశ్ రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా