బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని కన్నాల-బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిసర అటవీ ప్రాంతం(Forest area) వైపు గ్రామస్థులు ఎవరు వెళ్లవద్దని, బుగ్గ రోడ్డు మీదుగా రాకపోకలు సాగించవద్దని అటవీ సిబ్బంది కోరారు. బుగ్గ శివాలయానికి వెళ్లి కన్నాల గ్రామ(Kannala village) మూల మలుపు వద్ద శనివారం అడవి పందిపై పెద్దపులి దాడి చేసి చంపడంతో అటవీ సిబ్బంది(Forest staff) ఉలిక్కిపడ్డారు. వెళ్లిపోయిందని భావించిన పులి ఇదే ప్రాంతంలో సంచరించడంతో వారు పులి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరు కూడా కన్నాల అటవీ ప్రాంతం(Kannala forest area) వైపు వెళ్లవద్దని సూచిస్తున్నారు. కన్నాల గ్రామం నుండి బుగ్గ దేవాలయానికి వెళ్లే రోడ్డును మూసివేశారు. కన్నాల, లక్ష్మీపూర్ గ్రామాల్లో శనివారం అటవీ సిబ్బంది తిరుగుతూ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరారు. పులి కన్నాల, బుగ్గ అటవీ ప్రాంతంలో మకాం వేసి సంచరిస్తున్నందున రైతులు అటువైపు ఉన్న పొలాల వైపు వెళ్ళవద్దని కోరారు. ఈ ప్రాంతంలో రాత్రి వాహనాలపై రాకపోకలు సాగించవద్దని గ్రామస్తులకు సూచించారు.