calender_icon.png 4 April, 2025 | 7:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గచ్చిబౌలి భూములను ఎవరూ కొనద్దు!

04-04-2025 01:36:34 AM

  1. వచ్చేసారి అధికారంలోకి వచ్చేది మేమే..
  2. ఆ భూములను తిరిగి హెచ్‌సీయూకు ఇచ్చేస్తాం..
  3. ఎకో పార్క్ నిర్మిస్తాం.. 
  4. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): ‘రంగారెడ్డి జిల్లా కంచ గచ్చి బౌలి పరిధిలోని 400 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎవరూ కొనద్దు. వచ్చేసారి బీఆర్‌ఎస్సే అధికారంలోకి వస్తుంది. ఆ భూములను తిరిగి హెచ్‌సీయూకు అప్పగిస్తాం. అక్కడ అంద మైన ఎకో పార్క్ నిర్మించి హెచ్‌సీయూ విద్యార్థులతోపాటు నగర వాసులకు బహుమతిగా అందిస్తాం.

సీఎం రేవంత్‌రెడ్డి విసిరే బిస్కెట్లకు ఆశపడితే భూములు కొన్నవారు నష్టపోతారు’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడా రు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహానగరవాసులు మాకు మద్దతు పలికారని, ఎక్కువ ఎక్కువ సీట్లు ఇచ్చారని గుర్తుచేశారు. 

మొత్తంగా కాంగ్రెస్‌ను తుంగలో తొక్కారని నొక్కి చెప్పారు. నగరవాసుల ఆరోగ్య పరిరక్షణకు బీఆర్‌ఎస్ కట్టుబడి ఉందని, అందుకే జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు హెచ్‌సీయూ భూములను ప్రభుత్వం విక్రయించకుండా అడ్డుకుంటుందనని తేల్చిచెప్పారు. ఢిల్లీవాసులు ఇప్పటికే కాలుష్యం బారిన పడ్డారని, అక్కడ మెజార్టీ ప్రజలు మాస్క్‌లు ధరించి బయటకు వస్తారని తెలిపారు.

ఆ పరిస్థితి హైదరాబాద్‌వాసులకు రావొద్దనేదే తమ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం హయాంలో కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లుఓవర్లు నిర్మించేందుకు ప్రయత్నాలు జరిగాయని, ఆ ప్రక్రియ టెండర్ల వరకు వచ్చిందని గుర్తుచేశారు. కానీ.. ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో  ఫ్లుఓవర్ పనులను నిలిపివేశామని గుర్తుచేశారు.

సెల్యూట్ టు స్టూడెంట్స్..

గచ్చిబౌలి భూముల పరిరక్షణ కోసం వర్సిటీ విద్యార్థులు పోరాటానికి తాను సెల్యూట్ చేస్తున్నానని, వారి పోరాటం తమలో స్ఫూర్తి నింపిందని కేటీఆర్ కొనియాడారు. పది రోజులుగా విద్యార్థులు పోరాడుతుంటే కనీసం వారితో చర్చలు జరిపేందుకైనా సర్కార్ ముందుకు రాకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.

పోరాటం చేస్తున్న విద్యార్థులను గుంటనక్కలు, పేయిడ్ బ్యాచ్ అనడం సీఎం రేవంత్, మంత్రుల అహంకారానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. విద్యార్థినుల జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లడం, వస్త్రాలు చించడమే ప్రజా పాలనా? అని సీఎంను ప్రశ్నించారు. ‘గచ్చిబౌలి భూముల్లో వన్యప్రాణులే లేవు.

సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన చిత్రాలన్నీ ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ చిత్రాలు’ అనడం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కృత్రిమ మేధను బయట పెట్టిందని ఎద్దేవా చేశారు. వేరే రాష్ట్రాల నుంచి హెచ్‌సీయూలో చదువుకుంటున్న విద్యార్థులు సైతం హైదరాబాద్‌పై ప్రేమ పెంచుకున్నారని, అందుకే వారు కూడా పోరాటంలో భాగస్వాములయ్యారని కొనియాడారు.

హైదరాబాద్‌పై వారికున్న ప్రేమలో ఇసుమంతైనా సీఎం రేవంత్‌రెడ్డికి లేదని దుయ్యబట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రానికి బాస్ కాదని,  ఓ పెద్దపాలేరు మాత్రమేన్నారు. ప్రజాప్రతినిధులు ఎవరైనా ప్రజాసేవకులు మాత్రమేనని గుర్తుచేశారు.

ప్రజల సొమ్ముకు ప్రభుత్వ పెద్దలు కేవలం ధర్మకర్తలు మాత్రమేనని అభిప్రాయపడ్డారు. ‘రోజుకు 18 గంటలు పని చేస్తున్నా..’ అని చెప్పుకొంటున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రియల్‌ఎస్టేట్ వ్యాపారిలా కాకుండా, ఒక తండ్రి లా భవిష్యత్ తరాల మీద సోయితోని ఆలోచించాలని హితవు పలికారు. 

వెనక్కి తగ్గపోతే మార్చ్‌ఫాస్ట్..

ప్రభుత్వం ఇప్పటికైనా నిర్ణయాన్ని తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే హైదరాబాద్‌వాసులు, హెచ్‌సీయూ విద్యార్థులతో పాటు బీఆర్‌ఎస్ కార్యకర్తలు, పార్టీ నేతుల మార్చ్‌ఫాస్ట్ చేస్తామని హెచ్చరించారు. భూముల విక్రయంపై ఇప్పటికే తమ పార్టీకి చెందిన ఎంపీలు రాజ్యసభలో లేవనేత్తారని, ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారన్నారు.

ఇప్పటికైనా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ హెచ్‌సీయూకు విచ్చేయాలని, విద్యార్థులను స్వయంగా కలిసి మాట్లాడాలని పిలుపునిచ్చారు. రోహిత్ వేముల బలవన్మరణానికి పాల్పడినప్పుడు రాహుల్‌గాంధీ హెచ్‌సీయూకు వచ్చారని, అప్పుడు తమ ప్రభుత్వమే అధికారంలో ఉందని గుర్తుచేశారు. రాహుల్‌కు తాము కట్టుదిట్టమైన భద్రత కల్పించామన్నారు.

వర్సిటీలో ఆయన నిరసన తెలిపేందుకు అన్నిరకాలుగా సహకరించామన్నారు. రాహుల్ గాంధీ ఇప్పుడు ఒక తప్పిపోయిన నేతగా, పొలిటికల్ టూరిస్ట్‌గా మారిపోయారని అని ఎద్దేవా చేశారు.  కేంద్ర మంతి బండి సంజయ్ అప్పుడప్పుడు పార్లమెంట్‌కు వెళ్లి భారత ప్రభుత్వ నివేదికలన్నింటినీ చదివితే బాగుంటుందని, టైం పాస్‌గా కేంద్ర ప్రభుత్వంలో ఉంటామంటే ఆయనకంత మంచిది కాదని హితవు పలికారు.

అర్ధరాత్రి పనులు ఎందుకు?

గచ్చిబౌలి భూములు ప్రభుత్వ భూమి అని చెప్తున్న ప్రభుత్వ పెద్దలు, అర్ధరాత్రి దొంగల్లా బుల్డోజర్లు పంపించడం ఎందుకని నిలదీశారు. కోర్టు సెలవులను చూసుకొని మరీ విధ్వంసం సృష్టించడమేంటని కేటీఆర్ మండిపడ్డారు. శని, ఆదివారాలు ప్రజల మీదకు బుల్డోజర్లు వెళ్తున్నాయని హైకోర్టు, సుప్రీం కోర్టులు తలంటినా ప్రభుత్వానికి బుద్ధి రాదా..? ఇంగితం రాదా? అంటూ ప్రశ్నించారు.

ఫుట్‌బాల్ ఆడడానికి వెళ్లిన రేవంత్‌రెడ్డి.. తర్వాత భూములను క్యాష్ చేసుకునేందుకు కొత్త ఆట మొదలుపెట్టారని ఆరోపించారు.  పశ్చిమ హైదరాబాద్‌కు కంచ గచ్చిబౌలి భూములు ఊపిరితిత్తుల లాంటివని అభివర్ణించారు. అక్కడి ప్రకృతిని ఆవాసంగా చేసుకుని నెమళ్లు, వన్యప్రాణులు, పక్షులు జీవిస్తున్నాయని, బుల్డోజర్ ఒక్కో  చెట్టును కూలుస్తుంటే అవి కన్నీరు పెట్టుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

వాటి ఏడుపు ప్రభుత్వానికి కనిపించకపోవడం దురదృష్టకరమన్నారు.  బీఆర్‌ఎస్ హయాంలో అన్నివర్గాలను ఒప్పించి ఫార్మాసిటీ కోసం 14,000 ఎకరాలు సేకరించామని గుర్తుచేశారు. ఇప్పుడా 14,000 ఎకరాలను ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ పేరిట నాశనం చేసేందుకు సిద్ధమైందని ఆరోపించారు. తమ హయాంలో హైదరాబాద్‌ను గ్రీన్ సిటీగా మార్చామని, అందుకు ఎన్నో జాతీయ ,అంతర్జాతీయ అవార్డులను సైతం కైవసం చేసుకున్నామని గుర్తుచేశారు.

ఎల్‌ఆర్‌ఎస్ గడువు పెంపుతో 15వేల కోట్లు లూటీ!

‘ఎక్స్’ వేదికగా కేటీఆర్

హైదరాబాద్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ గడుపు పెంపు పేరుతో మరో రూ.15 వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి ఖజానా నింపుకునే ప్రయత్నం చే స్తోందని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్య క్షుడు కేటీఆర్ ఆరోపించారు. ప్రతిపక్షం లో ఉన్నప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎల్‌ఆర్‌ఎస్ ఉచితం అని మభ్య పెట్టారన్నారు.

అధికారంలోకి రాగానే నా లుగున్నర లక్షల మంది నుంచి ఏకంగా రూ.1400 కోట్లను వసూలు చేశారని మండిపడ్డారు. ఢిల్లీ పార్టీల మ్యానిఫె స్టోలు చిత్తుకాగితంతో సమానమని ధ్వజమెత్తారు. అడ్డదారిలో అధికారంలోకి వచ్చేందుకు రేవంత్ మాయమాటలు చెప్పారన్నారు.  ఎల్‌ఆర్‌ఎస్ విషయంలో కాంగ్రెస్ సర్కారు మాట తప్పినందుకు రాష్ర్ట  ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

బీఆర్‌ఎస్ హయాంలో సంక్షేమం రూపంలో వేల కోట్లు గడప గడపకు చేరితే, కాంగ్రెస్ హయాంలో మాత్రం రివర్స్ గేర్ నడుస్తోందన్నారు. ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన పేద, మధ్యతరగతి ప్రజల నుంచి వేల కోట్లు వసూలు చేయడం వెన్నుపోటు లాంటిదని విమర్శించారు.