calender_icon.png 9 October, 2024 | 7:56 AM

ఎవరు ఏమన్నా ఇష్టమైన పనిని మానలేదు

03-10-2024 12:00:00 AM

ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది నటి రితికా సింగ్. తెలుగువారికి ‘గురు’ సినిమాతోనే పరిచయమైన ఈ భామ నటిస్తున్న ప్రాజెక్టుల్లో ఒక్కటైన ‘వేట్టయన్’ అక్టోబర్ 10న విడుదల కానుంది. ఇందులో ఈ అమ్మడు ఏఎస్‌ఐ రూప పాత్రలో కనిపించనుంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రితిక తన కెరీర్ గురించి, వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది.

“సినీ పరిశ్రమ అనే కాదు.. జీవితంలో ఎప్పుడో ఓసారి ఊహించనివిధంగా ఇబ్బందులు ఎదురుకావొచ్చు. ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. అందుకే నేను బాక్సింగ్, కరాటే నేర్చుకున్నా. ఆ వీడియో తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటా. అయితే, వాటిని చూసిన కొందరు ‘నువ్వు బాక్సింగ్, కరాటే వీడియోలు షేర్ చేయొద్దు.. నెటిజన్లు నిన్ను చూసి భయపడుతున్నారు’ అని చెప్పారు.

ఫైట్స్ వీడియోలే కాదు.. చీరకట్టు ఫొటోషూట్ ఫొటోలు, డ్యాన్స్ వీడియోలు.. అన్నీ పంచుకుంటా. నేను ఏదైనా చేయగలనని చెప్పడానికే ఇదంతా. అయినా ఎవరో ఏదో అన్నారని ఫైట్ వీడియోలు షేర్ చేయడం, ట్రైనింగ్ తీసుకోవడం మానలేదు. ఎందుకంటే, అది నాకు ఇష్టమైన పని. ఇంత స్ట్రాంగ్‌గా ఉండటం మంచిది కాదని చాలా మంది సలహాలిస్తుంటారు.

అలా ఎందుకు ఉండొద్దు?! నేను బయటికెళ్లినప్పుడు దురదృష్టవశాత్తూ ఏదైనా జరిగితే? నన్ను నేను రక్షించుకోవడానికి నాకంటూ కొన్ని బేసిక్స్ అయినా తెలిసుండాలి కదా! అలాగనీ అందరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాల్సిన అవసరమూ లేదు.. నీ గళాన్ని బయటకు చెప్పే ధైర్యం ఉంటే చాలు. మన వాయిసే ఒక ఆయుధం లాంటిది” అంటూ స్వీయ పరిరక్షణ పాఠాలు చెప్పుకొచ్చింది రితిక.