calender_icon.png 6 November, 2024 | 9:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా గొంతు ఎవరూ నొక్కలేరు

23-07-2024 01:02:28 AM

  1. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం
  2. ఎన్నికలప్పుడే రాజకీయాలు, ఇప్పుడు దేశం కోసం పనిచేద్దాం
  3. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ప్రతిపక్షాలకు ప్రధాని మోదీ హితవు 

న్యూఢిల్లీ, జూలై 22 : తమ ప్రభుత్వానికి దేశంలోని 140 కోట్ల మంది ప్రజల మద్ధతుందని, మా గొంతును ఎవరూ నొక్కలేరని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. సోమవారం పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం దేశం కోసం పోరాడుతోందని, ప్రతిపక్షాలు వచ్చే ఐదేళ్లు ప్రగతి కోసం పోరాడాలని, తర్వాత ఎన్నికల గురించి ఆలోచిద్దామని ఇండియా కూటమి నేతలకు సూచించారు. ఎన్నికల రాజకీయాలను పక్కనపెట్టి పార్లమెంట్‌ను మహిళలు, రైతులు, యువత జీవితాలను బాగు చేసేందుకు వాడదామని హితవు పలికారు.

‘ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్ అత్యంత కీలకమైంది. అమృత్ కాలానికి చెందిన బడ్జెట్ ఇది. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా ఈసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం. సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నాం. మనం 2029లో ఎన్నికల్లో పోరాడదాం. అప్పటివరకు దేశం కోసం పనిచేద్దాం. సభలో మాట్లాడేందుకు సభ్యులందరికీ అవకాశం వస్తుంది.

పార్లమెంటును రాజకీయాల కోసం కాకుండా దేశ ప్రజల అభ్యున్నతి కోసం ఉపయోగించుకుందాం” అని విపక్ష సభ్యులకు పిలుపునిచ్చారు. 60 ఏళ్ల తర్వాత ఒక ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిందని, వరుసగా మూడోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని గుర్తు చేశారు. కాగా, మోదీ 3.0 బడ్జెట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ తాయిలాలు ప్రకటిస్తారనే ఆశలో పారిశ్రామిక రంగాలు, వరాలు ప్రకటిస్తారనే ఆశలో మధ్యతరగతి, ఉద్యోగ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.