calender_icon.png 12 January, 2025 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం కంపెనీల ఒత్తిడికి తలొగ్గేది లేదు

12-01-2025 01:49:01 AM

  • కమిటీ నివేదిక ఆధారంగా ధరల పెంపు
  • కొత్త బ్రాండ్ల సరఫరాలో సులభతర వాణిజ్య విధానం
  • నూతన కంపెనీలకు అనుమతుల్లో జాగ్రత్త
  • ఎక్సైజ్ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్, జనవరి 11 (విజయక్రాం తి): మద్యం ధరల పెంపుపై కంపెనీల ఒత్తిడి కి తలొగ్గేది లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. పొరుగున ఉన్న ఏపీ, మహారాష్ర్టతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న బీర్ల ధరలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వం లోని ధరల నిర్ణయ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా మద్యం ధరల పెంపుపై ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకుంటామని తేల్చిచెప్పారు.

ఇటీవల యునైటెడ్ బేవరేజస్ కంపె నీ బీర్ల రేట్లను 33.1 శాతం పెంచాలని ఒత్తిడి చేసిందని ఎక్సైజ్ శాఖ అధికారులు సీఎంకు వివరించడంతో రేవంత్‌రెడ్డి ఈ విధంగా స్పందించారు. శనివారం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఎక్సైజ్ శాఖపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏడాది కాలంగా ఎక్సుజ్ శాఖకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్నట్టు సీఎం చెప్పారు. గత సర్కారు పెట్టిన బకాయిలు క్రమంగా క్లియర్ చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు.

రాష్ర్టంలో మద్యం సరఫరా చేసేందుకు ముందుకు వచ్చే కంపెనీలను ఎంపిక చేసేందుకు పారదర్శక విధానం పాటించాలని అధికారులకు సూచించారు. కొత్త  కంపెనీల ను అనుమతించే విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. ఇప్పటికే టీజీబీసీఎల్‌కు సరఫరా చేస్తున్న కంపెనీలు కొత్త బ్రాండ్లు సరఫరా చేసేందుకు సులభతర వాణిజ్య విధానం అనుసరించాలని సూచించారు. నూతన కం పెనీల నుంచి దరఖాస్తులు తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత కనీసం నెల రోజులు నిర్ణీత గడువు ఇవ్వాలని ఆదేశించా రు.

నూతన సంస్థలు తమ బ్రాండ్ల పేర్లతోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. నాణ్యతా ప్రమాణాలు, సరఫరా సామర్థ్యాన్ని పరిశీలించిన తర్వాతే కంపెనీల ఎంపిక ప్రక్రియను చేపట్టాలని అధికారుల ను ఆదేశించారు. సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఎక్సుజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ, ఎక్సుజ్ కమిషనర్ హరికిరణ్ పాల్గొన్నారు.