- రాహుల్ ఫామ్‌పై ఆందోళన వద్దు
- మీడియాతో రోహిత్ శర్మ
చెన్నై: గురువారం నుంచి బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు ఆరంభం కానున్న నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో ముచ్చటించాడు. బంగ్లాతో మ్యాచ్ కోసం కొత్త ఎత్తుగడలు వేయాల్సిన అవసరం లేదని రోహిత్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల బంగ్లా సాధించిన చారిత్రక విజయాలు చూసి కంగారుపడాల్సిన అవసరం లేదన్నాడు. ‘ప్రపంచంలోని ప్రతి జట్టు భారత క్రికెట్ జట్టును ఓడించాలనే ప్రయత్నిస్తుంది. మనల్ని ఓడించడం ఎవరైనా గౌరవంగా భావిస్తారు. కేఎల్ రాహుల్ మంచి టెక్నిక్ ఉన్న ఆటగాడు. స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలిగే సత్తా అతనికి ఉంది. అతని ఫిట్‌నెస్‌పై మాకు చింత లేదు.
కొత్త సపోర్టింగ్ స్టాఫ్ ఆలోచనా శైలి భిన్నంగా ఉంది. ద్రవిడ్ స్థానంలో కోచ్‌గా వచ్చిన గంభీర్ ఆలోచనా శైలిలో పోలికలు ఉన్నాయి. కానీ వాటితో ఆటగాళ్లకు ఇబ్బంది లేదు.’ అని చెప్పుకొచ్చాడు. చెన్నై వేదికగా జరగనున్న తొలి టెస్టుకు ఎర్రమట్టిని ఉపయోగించే అవకాశముంది. ఇది పేసర్లకు ఎక్కువ లాభదాయకం. స్పిన్నర్లకు కూడా ఈ పిచ్ అనుకూలమేనని క్యురేటర్ వెల్లడించారు. నవంబర్‌లో భారత్ ఆసీస్‌లో పర్యటించనున్న నేపథ్యంలో అక్కడి పిచ్‌లపై భారత పేసర్లు అలవాటు పడేందుకు ముందస్తుగా చెన్నై టెస్టుకు ఎర్రమట్టి పిచ్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది.