- చైనా వైరస్ గురించి ప్రజలు భయపడాల్సిన పనిలేదు
- రాష్ట్ర వైద్య సిబ్బంది అప్రమత్తంగానే ఉంది
- ప్రజారోగ్య శాఖ రాష్ట్ర సంచాలకుడు డాక్టర్ రవీందర్ నాయక్
హైదరాబాద్, జనవరి 4 (విజయక్రాంతి): చైనాలో హెచ్‌ఎంపీవీ (హ్యుమన్ మెటా న్యూమో వైరస్) ప్రభావం పెరిగినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ప్రజలకు అవగాహన కల్పించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సిద్ధమయ్యారు. కొత్త వైరస్ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని ప్రజారోగ్య శాఖ రాష్ట్ర సంచాలకుడు డాక్టర్ రవీందర్ నాయక్ వెల్లడించారు.
ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన జారీ చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు హెచ్‌ఎంపీవీ వైరస్ కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదన్నారు. ఈ వైరస్‌కు సంబంధించిన పరిస్థితిని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ నిశితంగా గమనిస్తోందని తెలిపారు. 2023తో పోలిస్తే 2024లో శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల సంఖ్యలో పెద్దగా పెరుగుదల లేదని చెప్పారు. చైనా వైరస్ గురించి రాష్ట్ర ప్రజలు భయపడాల్సిన పనిలేదన్నారు. అంటురోగాలు వ్యాపించకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇవీ జాగ్రత్తలు..
* దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు చేతి రుమాలు లేదా టిష్యూ పేపర్‌తో కవర్ చేయాలి
* సబ్బు లేదా శానిటైజర్‌తో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి
* జనం రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలి
* జలుబు, దగ్గుతో బాధపడుతున్న వ్యక్తులకు దూరంగా ఉండాలి
* పౌష్టికాహారం, తాగునీరు ఎక్కువగా తీసుకోవాలి
* అనారోగ్యం బారిన పడిన వారు సాధ్యమైనంతగా మేరకు ఇంట్లోనే ఉండాలి
* సరైన నిద్ర అవసరం
చేయకూడనివి..
* షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు
* టిష్యూ పేపర్లను తిరిగి వాడకూడదు
* కళ్లు, ముక్కు, నోటిని తరచుగా తాకొద్దు
* బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయవద్దు
* డాక్టర్ల సూచనలు లేకుండా ఔషధాలు తీసుకోవద్దు