calender_icon.png 10 January, 2025 | 9:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్‌ఎంపివిపై భయాందోళనలు వద్దు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్

10-01-2025 01:32:12 AM

జగిత్యాల, జనవరి 9 (విజయ క్రాంతి): హెఎంపివి వైరస్ విషయంగా ప్రజలు భయాందోళనలకు గురికావద్దని, సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు రావని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్’కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘హెఎంపివి’ వైరస్  వ్యాప్తిపై ‘భయం వీడుదాం - జాగ్రత్తలు పాటిద్దాం’ పేరుతో రూపొందించిన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రజా ఉపయోగమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అభినందించారు. హెఎంపివి వైరస్ విషయంగా ప్రజల్లో ఉన్న భయాందోళనలై తొలగించడం కోసం అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. ఈ కరపత్రం ద్వారా  పలు సోషల్ మీడియా వేదికలలో వస్తున్న తప్పుడు ప్రచారాలకు చెక్ పెట్టి, ప్రజలు భయపడకుండా  జాగ్రత్తలను పాటిస్తారని అన్నారు.

ఇటీవల ఐఎంఏ ఆధ్వర్యంలో కుక్క, పాము, తేలు కాటు వంటి చికిత్సలకు అవగాహన చేపట్టడం జరిగిందిని, జూనియర్ వైద్యులకు చికిత్స మెలకువలపై శిక్షణ ఇచ్చారని ఎమ్మెల్యే అభినందించారు. రోగం వచ్చాక చికిత్స కన్నా  రోగం రాకుండా జాగ్రత్తలు పాటించడం ఉత్తమం అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డా.హేమంత్, ప్రధాన కార్యదర్శి డా.శ్రీనివాస్’రెడ్డి, కోశాధికారి డా.సుధీర్, డా.వొడ్నాల రజిత తదితరులు పాల్గొన్నారు.