calender_icon.png 4 March, 2025 | 5:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై న్యాయ విచారణ అవసరం లేదు!

04-03-2025 02:08:10 AM

సహాయక చర్యల్లో లోటుపాట్లు ఉంటే కోర్టును ఆశ్రయించొచ్చు: హైకోర్టు

హైదరాబాద్, మార్చి 3 (విజయక్రాంతి): ఎస్‌ఎల్బీసీ సొరంగం ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు, ఈ పిటిషన్‌పై విచారణ అవసరం లేదని అభిప్రాయపడింది. అడ్వొకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి వాదనలను సైతం నమోదు చేసి.. పిల్‌పై విచారణ ముగించింది. ‘ఎనిమిది మంది కార్మికులు సొరంగం లో చిక్కుకుని పదిరోజులవుతున్నా సర్కార్ వారిని బయటకు తీసుకురాలేకపోతున్నది.

న్యాయస్థానం సొరంగంలో జరుగుతున్న పనులను నిలిపివేసేలా సర్కార్‌కు ఆదేశాలు ఇవ్వాలి’ అంటూ జాతీయ వలస కార్మికుల సంఘం ఉపాధ్యక్షుడు పీవీకేకే భార్గవ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పిల్‌పై తాత్కాలిక ప్రధాన జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ రేణుకా యారా ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. ‘రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఎల్బీసీ సొరం గంలో చిక్కుకున్న కార్మికులను వెంటనే బయటకు తీసుకురావాలి.

బాధిత కుటుంబాలకు వెంటనే పరిహారం చెల్లించాలి. భవిష్యత్ ఇలాంటి సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలి’అని కోర్టును కోరారు. వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభు త్వం తరఫున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ.. ‘ఎస్‌ఎల్‌బీసీ సొరంగం 44 కి.మీ మేర ఉంటుంది. సొరంగంలో ఈ నెల 22న ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారు. అప్పటి నుంచి ప్రభుత్వం సహాయక చర్యలు కొనసాగిస్తున్నది.

సైన్యం, నేవీ, సింగరేణి, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, హైడ్రా, ఎల్‌అండ్‌టీ తదితర రెస్క్యూ బృందాలు అలుపు లేకుండా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. చర్యలను సర్కార్ నిరంతరం పర్యవేక్షిస్తున్నది’ అని కోర్టుకు తెలిపారు. ఏజీ వాదనలో ధర్మాసనం ఏకీభవించింది. సహాయక చర్యలు కొనసాగుతున్న సమయంలో న్యాయ విచారణ అవసరం లేదని స్పష్టం చేసింది. చర్యల్లో ఏవైనా లోటుపాట్లు జరిగినప్పుడు కోర్టును ఆశ్రయించొచ్చని పిటిషనర్‌కు సూచించింది.