మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఫైర్
చేవెళ్ల, జనవరి 16: రాష్ట్రంలో 35 శాతానికి మించి రుణమాఫీ జరగలేదని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఆరోపించారు. చేవెళ్ల మండలం కేసారం గ్రామ రెవెన్యూలోని బృందావన కాలనీలో బీఆర్‌ఎస్ సీనియర్ నేత కార్తిక్ రెడ్డితో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు అడ్డగోలు హామీలు ఇచ్చారని, గ్యారంటీ కార్డులు కొట్టించి మరీ కాంగ్రెస్ నేతలు ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారని గుర్తు చేశారు.
అధికారంలోకి వచ్చాక ఉచిత బస్సు తప్ప ఏ హామీలు అమలు కాలేదని మండిపడ్డారు. ఆగస్టు 15 రోజున బహిరంగ సభలో రుణమాఫీ పూర్తయినట్లు ప్రకటించారని, కానీ ఇప్పటి వరకు ఏ గ్రామంలోనూ 35 శాతానికి మించలేదని విమర్శించారు.అంతకుముందు మంత్రులు ఒకసారి రూ.46 వేల కోట్లని, కేబినెట్ మీటింగ్ పెట్టి రూ. 42 వేల కోట్లని, మరోసారి రూ.26 వేల కోట్లని మూడు రకాలుగా మాట్లాడారని మండిపడ్డారు.
చివరికి 18 వేల కోట్ల రుణమాఫీ చేశామని ప్రకటించి.. రైతుల అకౌంట్లలో రూ. 7 వేల కోట్లే జమ చేశారని ఆరోపించారు. తాను గతంలోనే కొడంగల్ నియోజక వర్గంలోని ఏ గ్రామమైనా తీసుకొని గ్రామ సభ పెట్టి హామీలపై చర్చిద్దామని సీఎం రేవంత్ రెడ్డికి చాలెంజ్ చేశానని గుర్తుచేశారు. కనీసం 40 శాతం హామీ లన్నా అమలైనట్లు తేలితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించానని, అయినా సీఎంకు చీమకుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు.
కేసీఆర్ ఎకరాకు రూ. 5000 ఇస్తే రేవంత్ రెడ్డి రూ. 7,500 ఇస్తానని హామీ ఇచ్చారని, ఇప్పుడు 5 వేలకు కూడా దిక్కులేదని ఎద్దేవా చేశారు. రైతు బంధు, రుణమాఫీ, 4వేల పింఛన్, తులంబంగారం ఇలా ఏ హామీ అమలు కావడం లేదని, వీటన్నింటికి నిరసనగా షాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో రైతు నిరసన దీక్ష చేపట్ట నున్నట్లు వెల్లడించారు.
చేవెళ్ల నియోజక వర్గంలోని రైతులంతా పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. కార్తిక్ రెడ్డి మాట్లాడుతూ... చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్ నుంచి ప్రారంభం కానున్న రైతు దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతాయని ప్రకటిం చారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావా లని, రైతుల తరఫున కొట్లాడాలని కోరారు.
డీసీఎంఎస్ చైర్మన్ పట్లొళ్ల కృష్ణారెడ్డి, బీఆర్‌ఎస్ చేవెళ్ల, శంకర్పల్లి మండల అధ్యక్షులు పెద్దొళ్ల ప్రభాకర్, గండిచర్ల గోవార్దన్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, బీఆర్‌ఎస్ నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు దేశమోళ్ల ఆంజనేయులు, షాబాద్ మాజీ జడ్పీటీసీ అవినాశ్ రెడ్డి, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు వంగ శ్రీధర్ రెడ్డి, సీనియర్ నాయకుడు హన్మంత్ రెడ్డి, విఘ్నేశ్ గౌడ్, గుడిపల్లి శేఖర్ రెడ్డి, రామాగౌడ్, నర్సింలు, కెప్టన్ అంజన్ గౌడ్, బీఆర్‌ఎస్ మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు అబ్దుల్ ఘని, మాజీ ఎంపీటీసీ ఎల్లన్న, బీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.