calender_icon.png 25 November, 2024 | 3:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇక ఇంటింటికీ ఇంటర్నెట్!

28-09-2024 12:47:51 AM

  1. తక్కువ ధరకే హైస్పీడ్ సేవలందించేలా చర్యలు
  2. మూడు గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టిన ప్రభుత్వం
  3. అక్కడి ఫలితాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా సేవలు
  4. టీ ప్రాజెక్ట్‌పై గత ప్రభుత్వ నిర్లక్ష్యం

హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే ఇంటింటికీ హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి రానుంది. నగరాలు, పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ హైస్పీడ్ క్వాలిటీ ఇంటర్నెట్ అందించేందుకు ప్రభుత్వం, ఐటీ శాఖ కసరత్తు ముమ్మరం చేస్తోంది.

రాష్ట్రంలోని 33 జిల్లాలను 10 జోన్లుగా విభజించి టీ గ్రిడ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ప్రైవేట్ సంస్థల ద్వారా ఇంటర్నెట్ అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. సంబంధిత అధికారులు ఇప్పటికే ఆయా సంస్థల నుంచి టెంటర్లను ఆహ్వానించినట్టు తెలుస్తోంది.

ముందుగా 3 నెలలపాటు ఇంటర్నెట్, టీవీ ప్రసారాలు ఉచితంగా అందించేలా ఆలోచనలు చేస్తున్నారు. అనంతరం అతి తక్కువ ధరలకే ఆయా సేవలను అందించే లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. 

గత ప్రభుత్వ నిర్లక్ష్యం.. 

గృహాలు, ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీలకు వేగవంతమైన ఇంటర్‌నెట్ ఇవ్వాలన్న లక్ష్యంతో తొమ్మిదేండ్ల క్రితం గత ప్రభుత్వం టీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. 33 జిల్లాల్లోని 589 మండలాలు, 12,751 గ్రామపంచాయతీలు, 10,128 రెవెన్యూ గ్రామాల పరిధిలో 83.58 లక్షల ఇండ్లకు ఇంటర్‌నెట్ అందించాలన్న లక్ష్యంతో 2015లో ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు.

కానీ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్ట్‌లో ప్రగతి సాధించలేదు. ప్రాజెక్టు పనులు సగం కూడా పూర్తి కాలేదు. నిధుల్లేక చాలా చోట్ల పనులు నిలిచిపోయాయి. ఆ ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేగవంతం చేస్తుంది. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తిచేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది.

2023 ఆర్థిక సంవత్సరంలో బీఆర్‌ఎస్ ఐటీ శాఖకు కేవలం రూ.362 కోట్ల బడ్జెట్ కేటాయించగా, ఏ ఏడాది కాంగ్రెస్ గవర్నమెంట్  ఏకంగా రూ.774 కోట్ల బడ్జెట్ కేటాయించింది. తద్వారా ఐటీ శాఖల్లోని పనుల పురోగతిపై ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకుంది.

వడ్డీలేని రుణంపై కేంద్రానికి విజ్ఞప్తి

తెలంగాణ టీథూ ప్రాజెక్ట్ అమలుకు ఎన్‌ఎఫ్‌ఓఎన్ సహకారం అవసరం. ప్రాజెక్ట్ కోసం రూ. 1,779 కోట్ల వడ్డీ లేని రుణం మంజూరు చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. టీ ప్రాజెక్ట్ ద్వారా గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణ ప్రాంతాల్లోని 30 లక్షల ఇళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి రానుంది.

రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిపై కేంద్రప్రభుత్వం సైతం సానుకూలత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే టెండర్ల ప్రక్రియ వేగవంతమైంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కానుండగా, తొలత మూడు నెలల పాటు ఉచితంగా సేవలు పొందే అవకాశం లభిస్తుంది. 

3 నెలల తర్వాత రూ.300

మూడు నెలల తర్వాత ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ సేవలను రూ.300 అందించనున్నట్టు సమాచారం. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర టెలికాం శాఖమంత్రి జ్యోతిరాధిత్య సింధియాతో భేటీ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న టీ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్ చేర్చాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణలోని ప్రతీ గ్రామం, మండలాలకు నెట్‌వర్క్ కల్పించడమే టీథూ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యమని కేంద్రమంత్రికి సీఎం వివరించారు. దీంతోపాటు 65 వేల ప్రభుత్వ సంస్థలకు కూడా సేవలందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 63 లక్షల ఇళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నారు. 

మూడు గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్..

కేంద్రం సూచనల మేరకు రా ష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం సంగుపేటలో, నారాయణపేట జిల్లా మద్దూర్ మండల కేం ద్రంలో, పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో అడవి శ్రీరాంపూర్ గ్రామాలను పైలట్ ప్రాజెక్ట్‌గా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ గ్రామాల్లో పూర్తిస్థాయిలో నెట్‌వర్క్ విస్తరిస్తుంది.

ఈ పైలట్ గ్రామాల్లో ప్రధానంగా కేబుల్ టీవీ సర్వీస్, కేబుల్ వర్చువల్ డెస్క్‌టాప్ కనెక్టివిటీ, 20 ఎంబీ అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, టెలిఫోన్ సౌకర్యం కల్పించనుంది. అయితే ఈ పైలట్ ప్రాజెక్ట్‌కు ఎంపిక చేసిన గ్రామాల్లో 4 వేల ఇళ్లకు ఈ సేవలను అందించేలా ప్రభుత్వం చర్య లు తీసుకుంటుంది.

ఈ మూడు గ్రామాల వచ్చిన ఫలితాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చే సేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. దీంతోపాటు, అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ గ్రామా ల్లో 360 డిగ్రీస్‌లో ఆర్టిఫీషియెల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి సీసీ కెమెరాలను అమర్చేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. రెండు నెలల్లో పైలట్ ప్రాజెక్టు పూర్తి చేసి అక్కడి ఫలితాల ఆధారంగా ముందుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.