calender_icon.png 23 October, 2024 | 4:03 AM

ఇక పోరుబాట

23-10-2024 02:00:35 AM

  1. ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ
  2. సీఎంను కలిసేందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వట్లేదు 
  3. డీఏలు ప్రకటించకుంటే సర్కారుతో ‘ఢీ’!
  4. జనవరి 30 వరకు వివిధ రూపాల్లో ఆందోళనలు 
  5. ఆ తర్వాత సహాయ నిరాకరణే
  6. క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోవాలని డిమాండ్

హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు జంగ్ ప్రకటించారు. దశలవారీగా ఉద్యమ కార్యాచరణను తెలంగాణ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు, కార్మికులు, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ కమిటీ (టీఈజేఏసీ) ప్రకటించింది.

ఉద్యోగులంతా పెండింగ్ సమస్యల పరిష్కార సాధనకై పోరుబాటకు సిద్ధమయ్యారు. తమతో చర్చించి తమ దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను సీఎం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జనవరి 30 వరకు పరిష్కరించాలని, లేకుంటే సహాయనిరాకరణకు వెనుకాడబోమని అల్టిమేటం జారీచేశారు.

మంగళవారం నాంపల్లిలోని టీఎన్జీవో భవన్‌లో కార్యవర్గ సమావేశం అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, అధ్యాపక, పెన్షనర్ల సంఘం నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తమకు విశ్వాసం ఉందని, తమలాగే తెలంగాణ కోసం ఆయన కూడా కొట్లాడారని, అయితే సీఎంను కలవకుండా చేస్తున్నారని ఆరోపించారు.

సీఎం, సీఎస్ ఉద్యోగులకు సమయం కేటాయిస్తలేరని వారు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఏర్పడి పది నెలలవుతున్నా తమ సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఆగస్టు 15 వరకు, రైతులకు రుణమాఫీ చేసేవరకు ఆగాలని తమను ప్రభుత్వం కోరడంతో ఇప్పటి వరకు ఓపిక పట్టామని, ఇప్పుడు క్షేత్రస్థాయి నుంచి, ఉద్యోగుల నుంచి తమపై వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో ఉద్యమ కార్యాచరణను ప్రకటించాల్సి వచ్చిందన్నారు.

సమస్యలపై తమతో చర్చించి ఈనెల 26న క్యాబినెట్ సమావేశంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక్క డీఏ పెండింగ్‌లో ఉంటే గతంలో ధర్నాలు చేసిన సందర్భాలున్నాయని, ఐదు డీఏలు ఎప్పుడూ పెండింగ్‌లో లేవని పేర్కొన్నారు. 

ఉద్యమ కార్యాచరణ ఇలా..

* 23 నుంచి 30 వరకు 33 జిల్లాల కమిటీల ఏర్పాటు

* 28న సీఎం, సీఎస్‌కు కార్యాచరణ లేఖ అందజేత

* నవంబర్ 2న అన్ని జిల్లా జేఏసీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు చేపట్టి జిల్లా కలెక్టర్లకు కార్యాచరణ లేఖ అందజేత

* 4,5న జిల్లాల్లో ర్యాలీలు చేపట్టి ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాల సమర్పణ

* 6న టీఉద్యోగుల జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

* నవంబర్ 7 నుంచి 27 వరకు ఉమ్మడి పది జిల్లాల్లో ఉద్యోగుల పెండింగ్ సమస్యల సాధన సదస్సులు నిర్వహణ, మిగతా పెద్ద జిల్లాల్లోనూ ఏర్పాటు

* జనవరి 3, 4న నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు, భోజన విరామ సమయంలో ప్ల కార్డులతో నిరసన ప్రదర్శనలు

* జనవరి 21న రాష్ట్ర వ్యాప్తంగా మౌన ప్రదర్శనలు

* 23న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో బైక్ ర్యాలీలు

* జనవరి 30న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో, హైదరాబాద్ కార్యాలయాలలో మానవహారాలు

ఆరు ప్రధాన డిమాండ్లు ఇవి..

* 1.7.2022 నుంచి పెండింగ్‌లో ఉన్న 5 డీఏలు వెంటనే విడుదల చేయాలి. బకాయిలను నగదు రూపంలో చెల్లించాలి.

* 2022 నుంచి పెండింగ్‌లో ఉన్న అన్ని బిల్లులను క్లియర్ చేయాలి. ఇ వ్యవస్థను రద్దు చేస్తూ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ద్వారా బిల్లులను క్లియర్ చేసి పాత విధానాన్ని పునరుద్ధరించాలి.

* ధరల పెరుగుదల ప్రకారం 51 శాతం ఫిట్‌మెంట్‌తో 2వ పీఆర్సీ సిఫార్సులను పీఆర్సీ రిపోర్ట్‌ను తెప్పించుకుని అమలు చేయాలి.

* ఉద్యోగులు, పెన్షనర్ల కాంట్రిబ్యూషన్‌తో ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్) అమలు చేయాలి.

* కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం రద్దు, పాత పెన్షన్ పథకాన్ని సక్రమంగా పునరుద్ధరించాలి.

* జీవో 317ని సమీక్షించి, బాధితుల ఫిర్యాదులను పరిష్కరించాలి.

50 డిమాండ్లలో 44 ఆర్థికభారం లేనివే..

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మ్యానిఫెస్టోలో పెట్టిన ఏడు డిమాండ్ల లో ఆరు పరిష్కారం కాలేదని వారు పేర్కొన్నారు. ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయు లు, పెన్షనర్లు ఎంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. తమ 50 డిమాండ్లలో 44 డిమాండ్లు ఆర్థిక భారంలేని సమస్యలు మాత్రమే ఉన్నాయని, సీఎం ఒక్క పూటలో కూర్చుంటే పరిష్కారమవుతాయన్నారు.

ఉద్యోగులు కష్టపడి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని, ఇది తమ ప్రభుత్వమన్నారు. రాష్ట్రంలోని 10 లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని వెల్లడించారు. దసరా పండుగకు డీఏలను ప్రకటిస్తారని భావించామని, కానీ ప్రభుత్వం ప్రకటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

వరద బాధితులకు తమ ఉద్యోగులందరూ కలిసి రూ.140 కోట్లు సాయమందించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో పెండింగ్ బిల్లులు, డీఏలను ప్రకటిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, చాలా మంది ఉద్యోగులు రిటైర్డ్‌మెంట్ బెనిఫిట్స్ పొందలేకపోతున్నారని పేర్కొన్నా రు.

ఇప్పటివరకు మొత్తం 17.2 శాతం వరకు  డీఏలు రావాల్సిఉందన్నారు. పీఆర్సీని ఇంతవరకూ ప్రకటించలేదని, గత ప్రభుత్వం ఐదు శాతం ఐఆర్ ప్రకటించి చేతులు దులుపుకుందని మండి పడ్డారు. పెండింగ్ బిల్లులు ఒక్కో ఉద్యోగికి రూ.25 వేల నుంచి రూ.2 లక్షల వర కు ఉన్నాయన్నారు.

తామడిగేది గొంతొ మ్మ కోర్కెలు కావని, తమకు న్యాయం గా రావాల్సిన హక్కులను అడుగుతున్నామని చెప్పారు. ఎన్నికల సమయం లో బదిలీ అయిన ఉద్యోగులను తిరిగి వారి స్థానాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఐదువేల మంది వీఆర్వోలను తొలగించి వారికి పోస్టులు కేటాయించలేదన్నారు. నేటి నుంచి జనవరి 30 వరకు వివిధ దశల్లో ఉద్యమ కార్యాచరణను ఈ సందర్భంగా వారు ప్రకటించారు.

ఈ సమావేశంలో ఉద్యో గ, ఉపాధ్యాయ, లెక్చరర్, గెజిటెడ్ ఉద్యోగులు, పెన్షనర్ సంఘాల నాయకులు ముజీబ్ హుస్సేని, డా. మధుసూ దన్ రెడ్డి, చావ రవి, సదానందం గౌడ్, పర్వతి సత్యనారాయణ, దామోదర్ రెడ్డి, కే రమేశ్, మహమ్మద్ అబ్దుల్లా, రాధాకృష్ణ, అశోక్‌కుమార్ పాల్గొన్నారు.

దీర్ఘకాలిక పెండింగ్ డిమాండ్స్ ఇవి..

* అన్ని శాఖల్లో పని భారాన్ని తట్టుకోవడానికి కొత్త జిల్లాల్లో అదనపు క్యాడర్ స్ట్రెంత్‌ను మంజూరు చేయాలి.

* కొంగరకలాన్ వద్ద ఐడీవోసీ రంగారెడ్డి జిల్లా ఉద్యోగులకు 24% హెచ్‌ఆర్‌ఏ, రవాణా సౌకర్యాలను అందించడం.

* కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడం. భవిష్యత్ రిక్రూట్‌మెంట్లలో కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయడం, మినిమం టైం స్కేల్ అమలు.

* సర్వశిక్షా అభియాన్ వంటి కేంద్ర ప్రయోజిత పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్ట్, కేజీబీవీ ఉద్యోగుల క్రమబద్ధీకరణ.

* ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయాలి.

* సార్వత్రిక ఎన్నికల ప్రారంభానికి ౨ నెలల ముందు చేపట్టిన బదిలీలు రద్దు చేసి పాత స్థానాలకు బదిలీ చేయడం.

* రాష్ట్ర జాయింట్ స్టాఫ్ కౌన్సిల్/ఆఫీసర్స్ కమిటీని ఏర్పాటు చేయాలి. ప్రధాన ఉద్యోగ సంఘాలకు గుర్తింపునివ్వాలి.

* పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలు, మెడికల్ ఇన్‌వాలిడేషన్‌ల క్లియరెన్స్ కోసం రాష్ట్ర స్థాయిలో మెడికల్ ఇన్‌వాలిడేషన్ ఉద్యోగులకు కమిటీని ఏర్పాటు చేయాలి.

* పీఆర్సీ బిల్లులకు సంబంధించిన క్లెయిమ్‌లను ఆర్థికశాఖకు బదులుగా ట్రెజరీలు/పీఏవో డిపార్ట్‌మెంట్ ద్వారా అడ్మిట్ చేయడానికి అనుమతి, పీఆర్సీ ముందు బిల్లులను అనుమతించే ఆలస్యాన్ని నివారించడానికి దాని సమయాన్ని 31.3.2023 నుంచి 31.3.2026 వరకు వ్యవధిని పొడిగించాలి.

* పదవీ విరమణ అనంతరం సర్వీస్ పొడిగింపు, రీ చేయొద్దు. తద్వారా సర్వీస్‌లో ఉన్న జూనియర్ ఉద్యోగుల ప్రమోషన్ ప్రయోజనాలు కాపాడాలి.

* గ్రేడ్ 1, 2, 3, 4 కింద గ్రామ పంచాయతీల పునర్వ్యవస్థీకరణ, ఉద్యోగులు/క్యాడర్ కేటాయింపు, నియామకపు తేదీ నుంచి సర్వీసును లెక్కిస్తూ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్ కాలాన్ని 4 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలకు తగ్గించి ప్రమోషన్లు కల్పించడం.

* పరిపాలన అసౌకర్యాన్ని నివారించడానికి ప్యానెల్ సంవత్సరం మొదటి సెప్టెంబర్‌లో అన్ని విభాగాల్లో డీపీసీలను నిర్వహించడం ద్వారా అర్హులైన ఉద్యోగులందరికీ ప్రమోషన్లు ఇవ్వాలి.

* మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగులకు జీవో 142, పోలీస్ శాఖ జీవో నెం.42ని పునఃసమీక్షించాలి.

* ఇటీవల ప్రభుత్వం చిన్నారెడ్డి అధ్యక్షతన ఉద్యోగుల ఫిర్యాదులను పరిశీలించేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. నిబంధనలతోపాటు ఈ విషయంలో అవసరమైన ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలి.

* ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ క్యాడర్ స్ట్రెంత్‌ను ఆమోదించాలి.

* హెచ్‌ఓడీల నుంచి సెక్రటేరియట్‌కు బదిలీలపై నియామకాల కోసం 12.5 శాతం కోటా అమలు చేయాలి.

* శేరిలింగంపల్లి మండలం గోపన్న పల్లి గ్రామం వద్ద సర్వే నం.37లో ఉన్న టీఎన్జీవో ఫేస్‌ఆ చెందిన 101.02 ఎకరాల స్థలాలను టీఎన్జీవో యొక్క ఎంసీహెచ్‌ఎస్ లిమిటెడ్‌కు ప్రభుత్వం కేటాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలి.

* శేరిలింగంపల్లి మండలం గోపన్నపల్లి లోని సర్వే నం.36, 37లో ఉన్న భాగ్యనగర్ టీఎన్జీవో మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి ఇంటి స్థలాల భూమి కేటాయింపు.

* ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ క్లాస్ ఉద్యోగులలో మిగిలిపోయిన 50 మంది ఉద్యోగులు, 9, 10వ షెడ్యూల్స్ స్థానికత జిల్లా, జోనల్, మల్లీ జోనల్, అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్‌లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను తెలంగాణకు తీసుకురావాలి.

* జెడ్పీ వ్యాధిగ్రస్థ ఉద్యోగులపై ఆధారపడిన పిల్లలు/కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు చేపట్టాలి.

* మోడల్, రెసిడెన్షియల్ స్కూల్స్, వైద్య విధాన పరిషత్, గ్రంథాలయ సంస్థ, మార్కెటింగ్ కమిటీ, ఎయిడెడ్ సంస్థ ఉద్యోగులకు 010 హెడ్ ఆఫ్ అకౌంట్ ద్వారా జీతభత్యాలు చెల్లించాలి.

* నర్సింగ్ డైరెక్టరేట్లు మంజూరు చేయాలి.

* రాష్ట్రంలోని 2.9 లక్షల మంది పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక పెన్షనర్స్ డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేయాలి. అసోసియేషన్‌లకు భవనాలకు స్థలాలు కేటాయించాలి.

* ఉద్యోగులపై ఏసీబీ, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసులకు సంబంధించిన ఫైళ్లను వేగవంతంగా క్లియరెన్స్ చేసి, కమిటీ వేయడం, విచారణను వేగవంతం చేసి ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి.

* ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ఉన్నత విద్యార్హతలను పొందేందుకు ఓబీ సౌకర్యాన్ని అందించడానికి జీవో నెం.342 పునరుద్ధరణ చేయాలి.

* మరణించిన వీఆర్‌ఏ కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు చేపట్టాలి.

* వీఆర్‌ఓ, వీఆర్‌ఏలను తిరిగి రెవెన్యూ శాఖకు తీసుకురావాలి.

* ఓల్డ్ పెన్షన్ సిస్టమ్/కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టం అమలు చేయకుండా ఉస్మానియా వర్సిటీలో పక్కన పెట్టిన ఆర్డర్‌లను రద్దు చేయాలి. సీపీఎస్/ఓపీఎస్‌ను అమలు చేయాలి.

* గురుకుల, మోడల్ స్కూల్ టీచర్లందరికీ ప్రతి నెలా 1న వేతనాలు చెల్లించాలి.

* అన్ని జిల్లాలకు డీఈవో, డీఐఈవో, విద్యాశాఖలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు డిప్యూటీ ఈవో, అన్ని మండలాలకు ఎంఈవో పోస్టులు మంజూరు చేయాలి.

* క్లాస్ ఉద్యోగుల అన్ని ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా పూరించాలి. ఉద్యోగ సంఘానికి జిల్లాలలో, రాష్ట్రస్థాయిలో అసోసియేషన్ల కార్యాలయాలకు స్థలాలు మంజూరు చేయాలి.

* ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ ఉద్యోగులకు టైమ్ స్కేల్ మంజూరు చేయాలి.

* ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు.

* స్పెషల్ టీచర్స్‌కు (398) నోషనల్ ఇంక్రిమెంట్స్ మంజూరు చేయాలి.

* 1.9.2004 కంటె ముందు, నోటిఫికేషన్ జారీచేసిన ఆ తర్వాత నియామకాలు చేపట్టిన ఉద్యోగులకు సీపీఎస్ నుంచి ఓపీఎస్‌ను అమలు చేయాలి.

* 35 ఏండ్ల నుంచి మైనార్టీ వెల్ఫేర్ శాఖ ఉర్దూ అకాడమీలో పనిచేస్తున్న 142 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు జీవో నెం.14 ప్రకారం పీఆర్సీ అమలు చేయాలి. జీవో నం.60 ప్రకారం కనీస వేతనం అరియర్స్‌తో సహా చెల్లించి, వారి సర్వీసులను క్రమబద్ధీకరించాలి.

* వికలాంగుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి వికలాంగులకు పెండిగ్‌లో ఉన్న మూడు పీఆర్సీలను అమలు చేయాలి.

* పెన్షన్ క్మ్యూటేషన్‌ను 15 సంవత్సరాల నుండి 12 సంవత్సరాలకు కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్నట్టుగానే తెలంగాణలో కూడా అమలు చేయాలి.

* టీజీఎల్‌ఐ బోనస్ 130 శాతం నుంచి 80 శాతానికి తగ్గించారు. దీంతో వడ్డీ రేటును వెంటనే పునరుద్ధరించాలి.

* మారుమూల ప్రభుత్వ వైద్య కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపక వైద్యులకు ప్రత్యేక అలవెన్సు మంజూరు చేయాలి.

* బిస్వాల్ కమిసన్ 20 సంవత్సరాల సర్వీస్‌కు పూర్తి పెన్షన్ మంజూరుకు ప్రతిపాదించింది. కనుక 1.7.2018 నుంచి దీనిని అమలు చేయాలి.

* ప్రభుత్వ గురుకులాల్లో ప్రవేశపెట్టిన ఉమ్మడి టైం టేబుల్‌ను మార్పు చేయాలి. గురుకులాల్లో నెలకొన్న అన్ని సమస్యలు పరిష్కరించాలి.

* ఎయిడెడ్ విద్యాసంస్థల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి.

* అంగన్‌వాడీ ఉపాధ్యాయులు, వర్కర్స్‌కు స్వచ్ఛంద పదవీ విరమణను అనుమతించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను రెండు లక్షలు, ఒక లక్షకు పెంచడం చేయాలి. విధుల్లో మరణించిన అంగన్వాడీ ఉద్యోగులకు ఎక్స్ గ్రేషియా చెల్లించడం లాంటి సమస్యలను పరిష్కరించాలి.

* మహిళాభివృద్ధి సంక్షేమ శాఖలో కొత్త జిల్లాల్లో క్యాడర్ స్ట్రెంత్ సాంక్షన్ ఫైలును సీఎం ఆమోదించాలి.