calender_icon.png 20 September, 2024 | 6:16 AM

ప్యాచ్ వర్క్‌లకూ పైసలు లేవు!

19-09-2024 12:00:00 AM

రోడ్ల మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధుల కొరత 

2,553 కిలోమీటర్ల మేర దెబ్బతిన్న రహదారులు

శాశ్వత మరమ్మతులకయ్యే ఖర్చు రూ.2563.28 కోట్లు

తాత్కాలిక రిపేర్లు చేయాలన్నా రూ.100 కోట్ల పైనే..

కేంద్రం విడుదల చేసే నిధులపైనే ఆశలు

హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో రోడ్లు దెబ్బతినగా, వాటి మరమ్మతుల కోసం రాష్ట్రప్రభుత్వానికి నిధుల కొరత వెంటాడుతుంది. దీంతో కేంద్రం నుంచి అందే సాయం పైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ విషయాన్ని సాక్షాత్తు ప్రభుత్వ పెద్దలే వెల్లడిస్తున్నారు. తాజా వర్షాలకు ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో పెద్దఎత్తున రహదారులు కోతలకు గురయ్యాయి. అనేక చోట్ల కల్వర్టులు, వంతెనలు తెగిపోయాయి.

ఈ నేపథ్యంలో ముందుగా తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ప్రజారవాణాను పునరుద్ధరించాల్సి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం వద్ద కనీసం ప్యాచ్ వర్కులకు కూడా పైసా లేకపోవడంతో తాత్కాలిక మరమ్మతులకు కూడా కేంద్రంపైనే ఆధారపడాల్సి వస్తోంది. రాష్ట్రంలో 2,553 కిలోమీటర్ల మేర రోడ్లు, 199 హైలెవల్ బ్రిడ్జీలు, 85 కల్వర్టులు దెబ్బతిన్నాయి. వీటి పూర్తిస్థాయి మరమ్మతులకు రూ. 2563.28 కోట్ల నిధులు అవసరమని అధికారులు అంచనా వేశారు.

రూ.100 కోట్లుంటే తాత్కాలిక మరమ్మతులు..

వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిలను తాత్కాలిక మరమ్మతులు చేసేందుకు కూడా ప్రభుత్వం వద్ద నిధులు లేవు. అందుకే వెంటనే నిధులు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నారు. రాష్ట్ర రహదారుల మరమ్మతులకు కిలోమీటర్‌కు రూ.లక్ష, జిల్లా రహదారుల మరమ్మతులకు కి.మీ.కు రూ.6 వేల చొప్పున ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. రాష్ట్రంలో 1671.4 కి.మీ. మేర రాష్ట్ర రహదారులు దెబ్బతినగా వాటి తాత్కాలిక మరమ్మతులకు రూ.61.11 కోట్లు, 882 కి.మీ. మేర దెబ్బతిన్న జిల్లా రోడ్లకు రూ. 26.27 కోట్లు, కల్వర్టులు, వంతెనలకు రూ.12.72 కోట్లు.. మొత్తంగా రూ.100.09 కోట్లు విడుదల చేయాలని కేంద్రానికి నివేదించారు. ఆయా చోట్ల రోడ్లు 30 నుంచి 70 శాతం వరకు దెబ్బతిన్నాయి. వీటి శాశ్వత మరమ్మతులకు రూ.2463.19 కోట్లు అవసరమని అంచనా వేస్తున్నారు. 

ముందుకు రాని కాంట్రాక్టర్లు..

ఇప్పటికే కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలు భారీగా ఉండడంతో ప్యాచ్ వర్క్‌లు చేయడానికి సైతం వారు ముందుకు రావడం లేదు. ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలో ప్లాన్ వర్క్‌లకు సంబంధించి రూ. 518.58 కోట్లు, నాన్ ప్లాన్ వర్కులకు సంబంధించి రూ. 888.45 కోట్ల బకాయిలకు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉంది. చిన్నచిన్న బిల్లులు చెల్లించేందుకు సైతం శాఖ వద్ద నిధులు లేకపోవడంతో ప్యాచ్ వర్క్‌లు చేయడానికి కాంట్రాక్టర్లు ససేమిరా అంటున్నారు. ముందుగా బిల్లులు చెల్లిస్తేనే పనులు ప్రారంభిస్తామని భీష్మించుకొని కూర్చున్నారు. ఆర్‌అండ్‌బీ శాఖలో నిధుల కొరత విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే కేంద్రం నిధులు ఇచ్చేవరకు రోడ్ల మరమ్మతులకు మోక్షం లభిస్తుందో లేదో అర్థం కాని పరిస్థితి కనిపిస్తోందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.