calender_icon.png 9 October, 2024 | 6:03 AM

ఏ పోస్టులో తిప్పికొట్టినా పోలీస్‌వాడినే సార్

03-10-2024 12:00:00 AM

‘నన్ను ఏ పోస్టులో తిప్పి కొట్టినా నేను మాత్రం పోలీస్ వాడినే సార్. నా నుంచి వాడిని కాపాడటం ఎవరి వల్లా కాదు’ అని డైనమిక్‌గా సూపర్‌స్టార్ రజనీకాంత్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఆయన టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘వేట్టయన్-: ద హంటర్’. ఇందులో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషించారు. టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.

సుభాస్కరన్ నిర్మాత. మంజు వారియర్, ఫాహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, దుషారా విజయన్, రోహిణి, అభిరామి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ పాన్ ఇండియా సినిమా తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో అక్టోబర్ 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ మూవీ ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు.

‘ఈ దేశంలో ఆడపిల్లలకు భద్రత లేదు. కానీ, పోరంబోకులకు బాగా భద్రత ఉంది. ఇలాంటి మగ మృగాలను ఎన్‌కౌంటర్‌లో చంపేయాలి’ వంటి డైలాగులతో విషయమేంటో సగటు ప్రేక్షకుడికి అర్థమైపోతోంది. ‘వారంలో ఎన్‌కౌంటర్ జరిగిపోవాలి’ అని రావు రమేశ్ అనే మాటకు ‘అక్కర్లేదు సార్.. వారం రోజులు అక్కర్లేదు.

మూడే రోజుల్లో డిపార్ట్‌మెంట్‌కి మంచి పేరొస్తుంది’ అంటూ సమాధానం చెబుతూ ఎంట్రీ ఇస్తారు సూపర్‌స్టార్. ‘జస్టిస్ డినైడ్ అంటూ..’ కారులో వెళ్తూ కనిపిస్తారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. ‘కాలం విలువ తెలిసిన మనిషి మాత్రమే ఏదైనా సాధించగలడు’ అంటూ స్క్రీన్ మీద ఎంట్రీ ఇచ్చేస్తాడు రానా. ఈ చిత్రానికి మ్యూజిక్:అనిరుద్ రవిచందర్, సినిమాటోగ్రఫీ:  ఎస్‌ఆర్ కదిర్; యాక్షన్: అన్బరివు.