22-04-2025 12:00:00 AM
హైదరాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంను గెలిపించేందుకే, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పోటీ నుంచి తప్పుకున్నాయని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ ఆరోపించారు.
ఇన్నాళ్లు పాముకు పాలు పోసిపెంచినట్టు ఎంఐఎంను కాపాడుకుంటూ వచ్చిన బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయకుండా మరోసారి మజ్లిస్‌కు సహాయపడుతున్నాయని సోమవారం ఆయన ఓ ప్రకటనలో విమర్శించారు. ఈ మూడు పార్టీలను బీజేపీ ఒక్కటే ఎదుర్కొంటుందని తెలిపారు. బీజేపీ అభ్యర్థి గౌతమ్‌రావు గెలిచే అవకాశం ఉందని భావించి, బీఆర్‌ఎస్ పార్టీ తమ ఓటర్లను ఓటు వేయొద్దని పిలుపునివ్వడం దుర్మార్గమన్నారు.
ఓటు హక్కును కాలరాసేలా బీఆర్‌ఎస్ ప్రవర్తించడం సరికాదన్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన పార్టీ, ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ రెండూ కూడా రాష్ట్ర రాజధానిలో జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటే వారి పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలని ప్రజలను కోరారు. ఈ మూడు పార్టీలు ఎన్ని కుట్రలు పన్నినా, తామే గెలవబోతున్నామని లక్ష్మణ్ స్పష్టం చేశారు.