calender_icon.png 16 January, 2025 | 5:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మరు

01-12-2024 07:42:01 PM

సీఎం ప్రకటనకు పార్టీలకు అతీతంగా స్వాగతించాలి

డిసిసి అధ్యక్షులు, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి 

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ఎవరు ఎన్ని కుట్రలు చేసిన, ప్రజాపాలనకు ప్రజలు అండగా ఉన్నారని డిసిసి అధ్యక్షులు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన కాంగ్రెస్ నేతల తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కనీవినీ ఎరుగని రీతిలో రైతు పండుగకు పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చి సభను విజయవంతం చేసినట్లు చెప్పారు. పాలమూరు ముద్దుబిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు, రాష్ట్ర మంత్రి వర్యులు, ఎమ్మెల్యేలు.. రైతు పండుగ సభకు రావడం హర్షించదగ్గ విషయమని అన్నారు.

సభకు లక్ష మంది వస్తారనుకుంటే దానికి రెట్టింపు స్థాయిలో రైతాంగం సభకు హాజరవడం మా పట్ల రైతాంగానికి ఉన్న విశ్వసనీయత కు నిదర్శనమని అన్నారు. ప్రతిపక్షాలు మా పట్ల ఎన్ని కుట్రపూరిత ప్రచారాలు చేసిన ప్రజానీకం ఆ ప్రచారాన్ని నమ్మలేదన్నారు. గత ముఖ్య మంత్రులు ఎవ్వరూ కూడా పాలమూరు జిల్లాను పట్టించుకున్న పాపాన పోలేదనీ, , ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సంవత్సరానికి రూ.20వేల కోట్లు 5 ఏళ్ల పాటు కేటాయిస్తామని ప్రకటించడం జిల్లా ప్రజలందరూ గర్వించాల్సిన అంశమని అన్నారు. మాజీమంత్రి నిరంజన్ రెడ్డి సభను ఉద్దేశించి రైతులను బెదిరించే సభగా అభివర్ణించడం సిగ్గుచేటన్నారు. నిన్నటి సభతో నిరంజన్ రెడ్డికి మతిభ్రమించిందనారు.

జిల్లా అభివృద్ధికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి పై మరోసారి నిరంజన్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరునీ అన్నారు. ముఖ్యమంత్రి జిల్లాకు లక్ష కోట్లు కేటాయిస్తామన్న ప్రకటనను స్వాగతించాల్సింది పోయి విమర్శించడం సహేతుకం కాదన్నారు. పాలమూరు కంటే ఒక సంవత్సరం తర్వాత ప్రారంభమైన కాళేశ్వరం పూర్తయింది కానీ పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. జిల్లాలో ఉన్న 14 అసెంబ్లీ సీట్లలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఈ ప్రాంత ప్రజలు గెలిపించిన విషయాన్ని, బిఆర్ఎస్ పార్టీని మట్టి కరిపించిన సంగతి ఆ పార్టీ నాయకులు గుర్తించుకోవాలన్నారు. ముఖ్యమంత్రి పాలమూరు అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారని, ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కృతనిచ్చేయంతో ఉన్నారని అన్నారు. 

గ్రామాల రూపు రేఖలు మారుతాయి

టిపిసిసి ఉపాధ్యక్షులు, టిజి ఎంఎఫ్ సి చైర్మన్ ఓబెద్దుల్లా కొత్వాల్ 

జిల్లాకు ఏడాదికి రూ. 20వేల కోట్ల కేటాయింపుతో ఉమ్మడి జిల్లాలోని గ్రామాల రూప రేఖలు మారుతాయని, పేదరికం పోతుందని టిపిసిసి ఉపాధ్యక్షులు, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ అన్నారు. రైతు పండగ సభ చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధికి పాటుపడుతున్న సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, ముడా చైర్మెన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లు నరసింహ రెడ్డి, డిసిసి మీడియా సెల్ కన్వీనర్ సీజే బెనహర్, నాయకులు జహీర్ అక్తర్, సిరాజ్ ఖాద్రీ, రాములు యాదవ్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.