calender_icon.png 24 January, 2025 | 12:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు అనుకూలంగా 'మాస్టర్ ప్లాన్-జోన్ల విభజన' లేదు

23-01-2025 08:41:21 PM

ఆరోపించిన మేడ్చల్ మల్కాజిగిరి బీజేపీ అధ్యక్షులు డా.ఎస్.మల్లారెడ్డి..

ముషీరాబాద్ (విజయక్రాంతి): హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ జోన్ల విభజన బడా బాబులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు తప్ప రైతులకు ఏమాత్రం అనుకూలంగా లేదనీ మేడ్చల్ మల్కాజిగిరి బీజేపీ అధ్యక్షులు డా.ఎస్. మల్లారెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ పరిసరాల్లో అభివృద్ధి క్రమ పద్ధతిలో జరగవలసిన అవసరం ఉందనీ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జోన్ల విభజన వల్ల దాదాపుగా 50 వేల మంది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. కన్సర్వేషన్, ఇతర జోన్లలో ఉన్న రైతులు తమకు భూములున్నా సొంత ఇళ్లు కూడా నిర్మాణం చేయడానికి కూడా అనుమతులు లభించడం లేదని మండిపడ్డారు. హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ ను పునర్ సమీక్షించి, రైతులకు అనుగుణంగా జోన్లను నిర్ణయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

కనీసం ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకైనా జోన్లు మార్చుకునే స్వేచ్ఛ ఇవ్వాలన్నారు. జోన్ల మార్పిడీ సులభతరం చేయాలని, రింగ్ రోడ్డు లోపల ఉన్న రైతుల భూములన్నింటిని నివాస (రెసిడెన్షియల్) జోన్లుగా మార్చాలన్నారు. రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న భూములకు సర్వీస్ రోడ్డుతో అనుసంధానించే (రోడ్డు యాక్సెస్) అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. హెచ్ఎండీఏ-స్థానిక సంస్థల మధ్య అనుమతుల విషయంలో సమన్వయం ఉండాలని కోరారు. హెచ్ఎండీఏ ఆదాయంలో కనీసం సగం ఆదాయం స్థానిక సంస్థలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మేడ్చల్ మల్కాజిగిరి ప్రధాన కార్యదర్శులు బి.విగ్నేశ్వర్, ప్రసన్న నాయుడు, మాజీ అధ్యక్షులు అంజన్ కుమార్ గౌడ్, సెక్రటరీ కొమురయ్య పాల్గొన్నారు.