ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య
చెంచుపెంట మహిళకు పరామర్శ
నాగర్‌కర్నూల్, జూలై10 (విజయక్రాంతి): ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో అలసత్వం వహించొద్దని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య అధికారులను ఆదేశించారు. బుధవారం కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మినారాయణ, నినావత్ రాంబాబు నాయక్‌లతో కలిసి కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి గ్రామ గిరిజన చెంచుపెంటలో పర్యటించారు. దాడికి గురైన చెంచు మహిళ ఈశ్వరమ్మను పరామర్శించారు. ప్రభుత్వం నుంచి మహిళకు మంజూరైన ఇంటి నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. కాగా నిందితుడైన బండి వెంకటేష్ తమ్ముడు బండి శివుడు తమను బెదిరిస్తున్నాడని ఈశ్వరమ్మ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లింది. అనంతరం కలెక్టరేట్‌లో అట్రాసిటీ కేసులకు సంబంధించిన అంశాలపై కమిషన్ చైర్మన్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ సంతోష్ పాల్గొన్నారు.