స్పష్టంచేసిన హైకోర్టు
హైదరాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): పుష్ప- బెనిఫిట్ షో, టిక్కెట్ రేట్ల పెంపును నిలిపివేస్తూ ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు మంగళవారం స్పష్టంచేసింది. చిత్రం విడుదలకు రెండు రోజుల ముందు పిటిషన్ వేసి ఉత్తర్వులు కోరడం సరికాదంది. బెనిఫిట్ షోలకు సంబంధించి ఎన్ని టిక్కెట్లు సమర్పించారు, ఎంత వసూలైందన్న వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని సినిమా నిర్మాతలను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది.
బెనిఫిట్ షోలకు అనుమతిస్తూ, టిక్కెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతించడాన్ని సవాల్ చేస్తూ రంగారెడ్డి జిల్లాకు చెందిన సతీష్‌కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి బెనిఫిట్ షోల ద్వారా వచ్చిన సొమ్మును అభిమాన సంఘాలకు ఎలా కేటాయిస్తారని, దీనిపై తరువాత పరిశీలిస్తామన్నారు. ఈ దశలో సినిమా టిక్కెట్ రేట్ల పెంపుపై మధ్యంతర ఉత్తర్వులివ్వలేమని పేర్కొన్నారు.
పుష్ప- నిలిపివేయలేం
ఆధారాల్లేని ఆరోపణలతో పుష్ప సినిమా ప్రదర్శనను నిలిపివేయాలేమని హైకోర్టు స్పష్టంచేసింది. కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు జరిమానా విధిస్తామని, ఈ మొత్తాన్ని మహిళా శిశు సంక్షేమం కోసం కృషి చేసే స్వచ్ఛంద సంస్థకు అందజేయాలని పేర్కొంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌పై పుష్ప-1 ఉందని, రెండో భాగం కూడా ఇలానే చెడు సందేశాన్ని ఇచ్చే అవకాశం ఉన్నందున ప్రదర్శనను నిలిపివేయాలంటూ సికింద్రాబాద్‌కు చెందిన ఎస్ శ్రీశైలం పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ మౌసమీ ఛటర్జీ విచారణ చేపట్టారు. సెన్సార్ బోర్డు తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ జీ ప్రవీణ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ చిత్రాన్ని వీక్షించి 5 మార్పులు చేయాలని సూచించిందని, ఆ తరువాతే సెన్సార్ బోర్డు ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేసిందన్నారు. ఈ సినిమా వల్ల పిటిషనర్‌కు ఎలాంటి నష్టం వాటిల్లడం లేదనిచెప్పారు. వాదనలను విన్న న్యాయమూర్తి కేవలం టీజర్‌ను పరిగణనలోకి తీసుకుని ఊహాజనితంగా పిటిషన్ వేయడాన్ని తప్పుబట్టారు.
పిటిషనర్ తన అభిప్రాయాన్ని సమర్థించుకోవడానికి ఎలాంటి ఆధారాలూ చూపడంలేదన్నారు. అదీ సినిమా విడుదలకు మూడు రోజుల ముందు హడావుడిగా పిటిషన్ వేయడంపై సందేహాలు తలెత్తుతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ దశలో సినిమా ప్రదర్శనను నిలిపివేస్తే నిర్మాత, దర్శకులపై ప్రభావం పడుతుందని, ఊహాజనితమైన అంశాల ఆధారంగా ఉత్తర్వులివ్వలేమంటూ పిటిషన్ను కొట్టివేశారు.