calender_icon.png 6 October, 2024 | 6:00 PM

హైడ్రా ఇక్కడ వద్దు... అక్కడ ముద్దు

06-10-2024 02:06:37 AM

హైడ్రా.. ఈ పేరు గత కొన్ని రోజులుగా తెలంగాణలో మారుమోగుతోంది. చెరువులు, ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను కూల్చివేస్తున్న హైడ్రాపై బిన్నాభిప్రాయాలున్నాయి. కొంత మంది వ్యతిరేకిస్తుంటే.. మరికొందరు స్వాగతిస్తున్నారు. ఇదే సమయంలో పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఏకంగా హైడ్రా తరహా వ్యవస్థను తీసుకొచ్చేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టడం గమనార్హం.

హైడ్రాను స్ఫూర్తిగా తీసుకొని అక్కడ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించేసింది. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని పలువురు ఏపీ మంత్రులు స్వాగతించడంతోపాటు ‘ఆపరేషన్ బుడమేరు’ తీసుకొచ్చేం దుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు విజయవాడ మునిగి.. జనం అతలాకుతలమైన విషయం తెలిసిందే.

ఏపీలో బుడమేరు వాగుకు గండి పడటంతో రెండు మూడు రోజులు విజయవాడ ప్రాంతమంతా మునిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హై డ్రా తరహాలో ఆపరేషన్ బుడమేరును తీసుకొచ్చి అన్ని జిల్లాల్లో కాల్వల్లోని అక్రమ కట్టడాలు తొలగిస్తామని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రకటించడం విశేషం.