దిక్కులేక రోడ్లపైనే ధాన్యాన్ని ఆరబెడుతున్న రైతులు
కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల సూచనలు యంత్రాంగం బేఖాతరు
వనపర్తి, నవంబర్ 15 (విజయక్రాంతి): వనపర్తి జిల్లాలో సాగునీటి వసతి పెరగడం తో రైతులు ఏటా సాగు విస్తీర్ణాన్ని పెంచతున్నారు. వానకాలంలో పండించిన పంట ప్రస్తుతం చేతికొచ్చింది. చాలాచోట్ల అవసరమైన కల్లాలు లేకపోవడంతో రైతులు రోడ్ల పైనే ధాన్యాన్ని ఆరబోస్తున్నారు. చలికాలం కావడంతో ధాన్యంలోని తేమ ఆరేందుకు మరింత సమయం పడుతుంది. దీంతో రోజులకు రోజులు ధాన్యం రోడ్లపైనే ఉంటున్నది.
17 శాతం కన్న తేమ తక్కువ ఉంటేనే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు ధాన్యాన్ని కొంటున్నారు. అంతకన్నా తేమ శాతం ఎక్కువ ఉంటే తిరస్కరిస్తున్నారు. దీంతో పరిమిత కల్లాలలో ధాన్యాన్ని రోజుల తరబడి ఆరబోసుకోవాల్సిన పరిస్థితి ఉం టుంది. పొలాల వద్ద కల్లాలు ఉండకపోవడంతో రైతులకు ఇక రోడ్లే దిక్కయ్యాయి. రహదారుల పక్కన ధాన్యం పోసి ఉండడం తో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.
రైతులు పంటను ఆరబెట్టుకునేందుకు ఉపాధి పథకంలో భాగంగా కల్లాలు ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. కానీ, వాటిని క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో అధికారులు అలసత్వాని ప్రదర్శిస్తున్నారు. కొంద రు రైతులు స్వచ్ఛందంగా కల్లాలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ, ప్రభుత్వం వారికి తోడ్పాటుగా నిధులు విడుదల చేయడం లేదు.