calender_icon.png 21 January, 2025 | 12:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్షాలు తగ్గే వరకు సెలవులు వద్దు

01-09-2024 01:00:01 AM

  1. డెంగ్యూ, సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
  2. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రాజనర్సింహ

హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): రాష్ర్టంలో కురుస్తున్న వర్షాలు తగ్గేవరకు డాక్టర్లు, సిబ్బందికి సెలవులు ఇవ్వొద్దని ఉన్నతాధికారులను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రాజనర్సింహ ఆదేశించారు. సీజనల్ వ్యాధులు మరింతగా ప్రబలే అవకాశం ఉండడంతో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు రాజనర్సింహ తెలిపారు. శనివారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే డెంగ్యూ, సీజనల్ వ్యాధులపై డీహెచ్ కార్యాలయంలో ప్రత్యేకంగా మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసి డెంగ్యూ కేసులను సమీక్షించిచనట్లు తెలిపారు.

డాక్టర్లు, స్టాఫ్ అందరూ హెడ్ క్వార్టర్స్‌లోనే ఉండాలని, ప్రతి ఒక్కరూ డ్యూటీలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్(ఈడీడీ) దగ్గరగా ఉన్న గర్భిణులను ముందే హాస్పిటళ్లకు తరలించి, వెయిటింగ్ రూమ్స్ కేటాయించాలని ఆదేశించారు. గర్భిణికి, ఆమెతో వచ్చిన కుటుంబ సభ్యులకు భోజన వసతి కల్పించాలని ఆదేశించారు. అంబులెన్స్‌లు, మెడిసిన్, టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉంచుకోవాలని మంత్రి సూచించారు. రోగులకు అందించే ఆహారం, తాగునీరు విషయంలో అత్యంత జా గ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

వర్షాలు తగ్గిన తర్వాత దోమల బెడద ఎక్కువగా ఉం టుందని, ప్రస్తుతం తగ్గుముఖం పట్టిన జ్వరాలు మళ్లీ పెరిగే ప్రమాదం ఉందని మంత్రి హెచ్చరించారు. దీనిపై ముందే ప్రజలకు అవగాహన కల్పించాలని, పంచాయతీరాజ్, మునిసిపల్ శాఖ సహకారం తీసుకోవాలని సూచించారు. మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీల హాస్టళ్లలో స్టూడెంట్స్‌కు అందజేసే ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గురుకులాల పిల్లలకు అందించే భోజనం విషయంలోనూ జాగ్రత్తలు  పాటించేలా సంబంధిత శాఖ అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేయాలని ఆదేశించారు. సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా, డీఎంఈ వాణి, టీవీవీపీ కమిషనర్ అజయ్‌కుమార్, డీహెచ్ రవిందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.