- విద్యుత్ నియంత్రణ మండలి ప్రకటన
- ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ రూ.11,499.52 కోట్లు
- గృహ వినియోగదారుల మినిమం ఛార్జీ తొలగింపు
- 2024 ఏఆర్‌ఆర్‌ను ప్రకటించిన ఈఆర్సీ
హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాం తి): రాష్ట్రంలోని విద్యుత్ గృహ వినియోగదారులందరిపై విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) ఎలాంటి భారం పడకుండా నిర్ణయం తీసుకుంది. 2024-25 ఆర్థిక సం వత్సరానికి సంబంధించి ఎలాంటి విద్యుత్తు ఛార్జీల పెంపు ఉండదని స్పష్టంచేసింది.
సోమవారం విద్యుత్తు నియంత్రణ మండలి కార్యాలయంలో మీడియా సమావేశంలో రెండు డిస్కంలు (ఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్), సిరిసిల్ల సెస్ పరిధిలో దాఖలు చేసిన ఏఆర్‌ఆర్ (వార్షిక ఆదాయ అవసరాలు)పై విద్యుత్తు నియంత్రణ మండలి తీసుకున్న నిర్ణయాలను.. ఈఆర్సీ చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు, సభ్యులు తెలిపారు.
2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిస్కంలు దాఖలు చేసిన ఏఆర్‌ఆర్ మొత్తం రూ. 57,728.90 కోట్లుగా ప్రతిపాదనలు రాగా, రూ.54,183.28 కోట్లకు అనుమతిస్తూ ఈఆర్సీ తీర్పు చెప్పింది. డిస్కంలు ప్రతిపాదించిన దాని ప్రకారం.. మొత్తం రూ. 13,022.06 కోట్ల ఆదాయలోటు ఉంటుం ది. దీనిని ఈఆర్సీ రూ.11,156.40 కోట్లకు అనుమతించింది.
సిరిసిల్ల సెస్ పరిధిలో ఆదాయలోటు రూ.343.11 కోట్లుగా నిర్ణయించింది. దీనితో వాస్తవ ఆదాయ లోటు రూ.11,499.52 కోట్లుగా నిర్ధారించింది. ప్రభుత్వం నుంచి విద్యుత్ సబ్సిడీకి చెల్లించే మొత్తాన్ని గతేడాది కంటే రూ.2,374.7 కోట్లు పెంచినట్టు గుర్తించింది. ఇది దాదాపు 26 శాతంగా పేర్కొంది.
దీంతో 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వాస్తవ ఆదాయలోటు రూ.11,449.52 కోట్లను ప్రభుత్వం వివిధ సబ్సిడీల రూపంలో సమకూర్చుతుందని ఈఆర్సీపేర్కొంది.
మంత్లీ మినిమమ్ ఎనర్జీ ఛార్జీల తొలగింపు
గృహవినియోగదారులపై ఎలాంటి భారం మోపకుండా నిర్ణయం తీసుకున్న ఈఆర్సీ.. ఎల్టీ 1ఏ క్యాటగిరీ (గృహవినియోగదారులు) విషయంలో ప్రతి నెలా చెల్లించే మంత్లీ మినిమమ్ ఎనర్జీ ఛార్జీలను తొలగించింది. అలాగే ఎల్టీ 2 (నాన్ డొమెస్టిక్/ కమర్షియల్) వినియోగదారుల విషయంలో కిలోవాట్‌కు రూ.60 ఫిక్స్‌డ్ ఛార్జీని రూ.30కి తగ్గించింది.
ఈ తగ్గింపు 50 యూనిట్ల వరకు మాత్రమే వర్తిస్తుంది. దీనితోపాటు మంత్లీ మినిమమ్ ఎనర్జీ ఛార్జీల విషయంలో సింగిల్ ఫేజ్ సరఫరా అయితే.. రూ.65 నుంచి రూ.50కి తగ్గించింది. అలాగే త్రీఫేజ్ సరఫరా అయితే.. రూ.200 నుంచి రూ.100 కు తగ్గిస్తూ ఈఆర్సీ నిర్ణయించింది.
ఎల్టీ 3 క్యాటగిరీ (ఇండస్ట్రీ) విషయంలో పుట్టగొడుగుల పెంపకం కేంద్రాలు, కుందేలు పెంపకం కేంద్రాలకు ఇచ్చే గరిష్ఠ లోడును 10 హెచ్‌పీ నుంచి 25 హెచ్‌పీకి పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. గొర్రెలు, మేకలు, పాల ఉత్పత్తుల కేంద్రాలకు కూడా గరిష్ఠ లోడును 15 హెచ్‌పీ నుంచి 25 హెచ్‌పీకి పెంచారు.
ఎల్టీ 4 క్యాటగిరీ (కాటేజ్ ఇండస్ట్రీ) విషయంలో ఇప్పటి వరకు ఉన్న కనీసం మొత్తం రూ.30 అనే క్లాజ్‌ను తొలగించారు. వ్యవసాయానికి సంబంధించి ఛార్జీల విషయంలో ఎలాంటి మార్పు లేదు. హార్టికల్చర్ విషయంలో నర్సరీలకు ఇచ్చే లోడును 15 హెచ్‌పీ నుంచి 20 హెచ్‌పీలకు పెంచారు. ఎలక్ట్రికల్ వాహనాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈవీ చార్జింగ్ స్టేషన్లకు ఫిక్స్‌డ్ ఛార్జీలను రద్దు చేశారు.
విద్యుత్తు డిమాండ్ లేని సమయంలో ఇచ్చే టీవోడీ ఇన్సెంటివ్‌ను యూనిట్‌కు రూపాయి నుంచి రూ.1.50కి పెంచారు. రెండు డిస్కంలు 2024 నుంచి 2028 వరకు ప్రతిపాదించిన ఏఆర్‌ఆర్‌పైకూడా ఈఆర్సీ నిర్ణయం తెలిపింది. 2024 మొత్తం విద్యుత్ కొనుగోళ్లు రూ. 40,714.23 కోట్లు ఉండగా.. 2028-29 నాటికి రూ.56,221 కోట్లకు అనుమతిచ్చింది.